
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల ప్రక్రియ సాగుతున్న దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌పై వాదనలను ముగించింది.
జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం పుల్లూర్ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయుడు రాజీనామా చేయకుండానే అలంపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థీగా నామినేషన్ దాఖలు చేశారని, దాన్ని తిరస్కరించేలా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి.. జోక్యం చేసుకోలేమని వాదనలు ముగించింది.