సాక్షి, హైదరాబాద్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆ ఇద్దరు దొంగల వివరాలు తెలిపారు. ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ల దొంగతనాలు చేసిన షేక్ అబ్దుల్ జాఫర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని టౌలిచౌకీకి చెందిన ఇతడు ఆటో డ్రైవర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఆటో నడుపుతూనే దొంగతనాలు చేస్తున్నాడు. అతడి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ హారంతో పాటు ఒక బైక్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతడిపై మొత్తం 66 ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి.
హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన హాబీబ్ అజమత్ దక్షిణ జోన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడి సహాయకుడు షారూఖ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.10.50 లక్షల విలువైన 20 తులాల బంగారంతో పాటు ఆటోని సీజ్ చేశారు. ఇతడిపై ఇప్పటివరకు 30 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇద్దరి నుంచి మొత్తం రూ.22.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారికి కొన్ని జాగ్రత్తలు తెలిపారు. తాము ఊళ్లకు వెళ్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటించొద్దని.. అది దొంగలకు వరంగా మారుతుందని కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. గ్రామానికి వెళ్తున్న వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. తాము నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ముందే నివారణ చేసుకుంటే నేరాలు జరిగే అవకాశం లేదని కమిషనర్ అంజనీకుమార్ గుర్తుచేశారు. తాము ప్రవేశపెట్టిన యాప్స్ కూడా వినియోగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment