న్యూయార్క్: 15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మేగజీన్ ఆ బాల శాస్త్రవేత్తను ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ‘టైమ్’ ప్రశంసించింది. 5 వేల మందితో పోటీ పడి ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ తొలి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గుర్తింపును ఆమె సాధించింది. టైమ్ మేగజీన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేశారు. ‘గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం’ ఇదే తన ప్రయోగ విధానమని జోలీకి ఆమె వివరించారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సృజనాత్మక, శాస్త్రీయ దృక్పథం గల యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తన ఆశయాన్ని వెల్లడించారు. ‘కనిపించిన ప్రతీ సమస్యను పరిష్కరించాలనుకోవద్దు. మిమ్మల్ని బాగా కదిలించిన సమస్యపై దృష్టిపెట్టండి’ అని ఆమె సహచర యువతకు పిలుపునిచ్చారు. ‘నేను చేయగలిగానంటే.. ఎవరైనా చేయగలరు’ అని స్ఫూర్తినిచ్చారు. పాత తరం ఎదుర్కొన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలను తన తరం ఎదుర్కొంటోందని ఆమె వివరించారు. అందరినీ సంతోషంగా చూడాలనుకోవడం తన ఆశయమన్నారు. మార్పు కోసం సైన్స్‌ను ఎలా వాడాలన్న ఆలోచన తనకు రెండో, లేదా మూడో తరగతిలో ఉండగానే వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment