వాషింగ్టన్: వరదల్లో సరస్వం కోల్పోయినా పెంపుడు శునకాన్ని మాత్రం వదల్లేదు ఓ 17 ఏళ్ల అమ్మాయి. తన ప్రాణాలు కాపాడుకోవడమే గాక.. ప్రాణంగా ప్రేమించే సాండీని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. ఈ బాలిక చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా కెంటకీలో గ్రాండ్‌పేరెంట్స్‌లో కలిసి నివసిస్తోంది క్లో అడమ్స్. గురువారం ఉదయం నిద్ర లేచే సమయంలో ఇంట్లోకి వస్తున్న వరదనీటి ప్రవాహం చూసి విస్మయానికి గురైంది. క్షణాల్లోనే కిచెన్‌తో పాటు ఇల్లు మొత్తం జలమయం అయింది. నీళ్లు మోకాలి లోతుకు చేరాయి. వెంటనే తన పెంపుడు కుక్క సాండీ దగ్గరకు వెళ్లింది అడమ్స్. దాన్ని చేతితో పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
అయితే వరదనీటి స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. సాండీ ఈదగలదేమోనని అడమ్స్ చెక్ చేసింది. దాన్నినీటిలో వదిలితే ఈదలేకపోయింది. దీంతో ఓ చిన్న ప్లాస్టిక్ కంటైనర్‌లో సాండీని వేసి దాన్ని ముందుకుపంపుతూ వరద నీటిలో ఈదుకుంటూ స్టోరేజీ బిల్డింగ్ పైకప్పుకు చేరుకుంది అడమ్స్. వాళ్లకు రూఫ్ మాత్రమే ఆధారంగా మిగిలింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు అక్కడే సాయం కోసం ఎదురు చూసింది. చివరకు ఈ ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఆమె కజిన్ సహాయక బృందాల సాయంతో వాళ్లను రెస్క్యూ చేశాడు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అప్పటికే తలదాచుకుంటున్న తన మామయ్య ఇంటికి అడమ్స్ వెళ్లింది. ఆమె తండ్రి టెర్రీ అడమ్స్ కూడా అక్కడే ఉన్నాడు.
తన కూతురు పెంపుడు శునకాన్ని కాపాడిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు టెర్రీ. ఆమె హీరో అని అభివర్ణించాడు. అడమ్స్ శునకాన్ని పట్టుకుని రూఫ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వాటిని చూసి నెటిజన్లు బాలికను ప్రశంసలతో ముంచెత్తారు. సాండీని క్లో అడమ్స్ బాల్యం నుంచి ఆప్యాయంగా చూసుకుంటోంది. చిన్నప్పుడు ఆమె సాండీతో దిగిన ఫోటో కూడా వైరల్‌గా మారింది.
మరోవైపు కెంటకీలో గురువారం భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో 16 మంది మరణించారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల తాము సర్వస్వం కోల్పోయినా.. అంతకంటే ముఖ్యమైన తన కూతురు, సాండీ ప్రాణాలతో బయటపడటం ఆనందంగా ఉందని టెర్రీ అడమ్స్ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: 40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్ ట్రస్‌కే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment