లండన్ : బ్రిటన్‌లో ప్రాణాంతక కరోనా కేసులు ఏకంగా పది లక్షలు దాటడంతో దాన్ని కట్టడి చేయడంలో భాగంగా బ్రిటన్ అంతటా మరో విడత లాక్‌డౌన్‌ను నెల రోజుల పాటు అమలు చేయాలని ప్రధాని నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే దీని వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరగుతుందంటూ 42 మంది మానసిన వైద్య నిపుణులు ప్రభుత్వానికి లేఖలు రాశారు. లాక్‌డౌన్ కారణంగా గుండె, కిడ్నీలు, క్యాన్సర్ లాంటి ఆపరేషన్ల కోసం నిరీక్షిస్తోన్న రోగులకు ఇబ్బందులు ఏర్పడతాయని, అత్యవసర ఆపరేషన్లను అనుమతించినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా మానసిక ఒత్తిళ్లు పెరగుతాయని, అవి ఆత్మహత్యలకు దారి తీస్తాయని, మద్యపానం పెరగడం వల్ల కూడా అకాల మరణాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు ఆ లేఖలో హెచ్చరించారు.
ఆ లేఖపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేరి నిక్సన్ కూడా ఉన్నారు. మరోపక్క లాక్‌డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని వాయిదా వేయడమే అవుతుంది తప్పా, అరికట్టడం ఎంత మాత్రం వాస్తవం కాదని అంటు రోగాల నిపుణులు ఇది వరకే హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మనుషులు సమూహాలుగా తిరిగినట్లయితే వారిపై కరోనా వైరస్ సామూహికంగానే దాడి చేస్తుందని, అప్పుడు వైరస్ దాడి బలహీనంగా ఉంటుందని, వైరస్ దాడిని ప్రజలు సామూహికంగా ఎదుర్కోవడం వల్ల వారిందరిలో రోగ నిరోధక శక్తి పెరగుతుందని, దీన్ని ఆంగ్లంలో ‘హెర్డ్ ఇమ్యునిటి’ అంటారని, దాని వల్ల వైరస్‌ను శక్తివంతంగా ఎదుర్కోగలమని అంటురోగాల నిపుణులు సూచించారు. ( స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ )
వయోవృద్ధులు, ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారు కరోనా వైరస్ బారిన పడినట్లయితే ప్రమాదం కనుక వారికి నిర్బంధ ఏకాంతవాసం అమలు చేస్తే సరిపోతుందని కూడా నిపుణులు సూచించారు. బ్రిటన్ అంతటా లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల రోజుకు కనీసం 1.8 బిలియన్ పౌండ్లు (దాదాపు 17వేల వేల కోట్ల రూపాయలు) ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణలు హెచ్చరిస్తున్నారు. మొదటి విడత లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని ఎలా అధిగమించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రెండోసారి లాక్‌డౌన్ ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి విడత లాక్‌డౌన్ వల్ల ముఖ్యంగా యువతలో మానసిక ఒత్తిడి, ఆందోళన, గృహ హింస, మద్యపానం, ఆత్మహత్యలు భారీగా పెరిగాయని, రెండో విడత సందర్భంగా అవే పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని. లాక్‌డౌన్ కాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యపరంగా, ఇతరత్రా తగిన చర్యలు తీసుకోవాలని 42 మంది వైద్య నిపుణులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment