
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ప్రపంచ వైద్య నిపుణలు హెచ్చరించడం తెల్సిందే. కరోనా వైరస్ బారిన పడిన వారిలో సాధారణ ప్రజలకన్నా ముఖ్యంగా స్థూలకాయులు 40 శాతం ఎక్కువగా మరణించే అవకాశం ఉందని బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ కూడా హెచ్చరించింది. అయితే బ్రిటన్‌లో కరోనాను కట్టడి చేయడం కోసం విధించిన ఎనిమిది వారాల లాక్‌డౌన్ సమయంలో మూడొంతుల మంది బ్రిటిషర్లు లావెక్కారట. కనీసంగా మూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు బరువు పెరిగారని అంచనాలు తెలియజేస్తున్నాయి. (కరోనా కన్నా లాక్‌డౌన్ మరణాలే ఎక్కువ!)
18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు పౌండ్లకొద్దీ బరువెక్కగా, 65 ఏళ్లు దాటిన వృద్ధులు వారిలో సగం బరువు ఎక్కారట. రెండు నెలల క్రితం కన్నా లాక్‌డౌన్ విధించాక తాము లావెక్కామని 60 శాతం మహిళలు, 57 శాతం మగవాళ్లు ఓ సర్వేకు తెలియజేశారు. వారిలో తాము సుష్ఠుగా భోజనం చేయడమే లావుకు కారణమని ప్రతి ముగ్గిరిలో ఒకరు తెలియజేయగా, మిగతా వారు శరీరానికి వ్యాయామం లేకపోవడమని చెప్పారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారిలో 37 శాతం మంది స్థూలకాయులు కాగా, 29 శాతం మంది గుండెపోటుతో బాధపడుతున్న వారు, 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)
Comments
Please login to add a commentAdd a comment