మిస్ యూనివర్స్ కొరియా ఫైనలిస్ట్
సియోల్: పేరు: చోయి సూన్ హ్వా, వయస్సు:80. ఇటీవలే మిస్ యూనివర్స్ కొరియాఫైనలిస్ట్‌ల్లో ఒకరిగా నిలిచిరికార్డు బద్దలు కొట్టారు. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని, వయోధికురాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమవ్వడానికి దశాబ్ధం ముందు 1952లో ఈమె జన్మించారు. ఈ నెలారంభంలో మిస్ యూనివర్స్ కొరియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు.
సోమవారం మరో 31 మంది పోటీదారులతో ‘మిస్ యూనివర్స్ కొరియా’కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇందులో విజేతగా నిలిస్తే నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేయనున్నారు. ‘80 ఏళ్ల మహిళ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? శరీర సౌష్టవాన్ని ఎలా నిలుపుకోగలిగారు? ఏ ఆహారం తీసుకుంటున్నారు? అని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నా’అని ఆమె సీఎన్‌ఎన్‌తో అన్నారు.
హాస్పిటల్‌లో చిన్న ఉద్యోగం చేసి రిటైరైన చోయి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఆ ఉద్యోగంలో చేరారు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని తన వద్దకు వచ్చే రోగి ఒకరు ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘మొదట్లో ఆమె సలహా అర్థం లేనిదిగా అనిపించింది. ఆ తర్వాత నా చిన్ననాటి అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని తోచింది’అని తెలిపారు. అదే సమయంలో అప్పులు ఆమెకు భారంగా మారాయి. అలా, 72 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2018లో 74 ఏళ్ల వయస్సులో సియోల్ ఫ్యాషన్ వీక్‌లో మొట్టమొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత హార్పర్స్ బజార్, ఎల్ల్ మ్యాగజీన్లలో కనిపించారు. ఇప్పుడు, కొరియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తనకంటూ స్థానం సంపాదించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment