న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చాలనే కుట్రలో భారతీయ పౌరుడి ప్రమేయం ఉందనే ఆరోపణలపై వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని అమెరికా చాలా తీవ్రంగా తీసుకుందని చెప్పారు. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొంటూనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
“అమెరికాకు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసును మాత్రం మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ ఆరోపణలపై సీరియస్‌గా దర్యాప్తు చేపడతాం” అని వైట్ హౌస్ ఉన్నత అధికారి జాన్ కిర్బీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాకు భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.
పన్నూ హత్య కుట్ర కేసులో భారత్ కూడా దర్యాప్తుకు ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై జాన్ కిర్బీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని భారత్ కూడా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కేసులో దోషులను నిష్పక్షపాతంగా గుర్తించి శిక్షించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సీరియస్‌గా తీస్కోండి.. మళ్లీ భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment