అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ.. ఇలా అధికారం చేపట్టారో లేదో అంతలోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఐదు వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు జేవియర్ మిలీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
జేవియర్ మిలీ డిసెంబర్ 10న అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభంలో కూరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు రంగాలలో కోతలు, పెట్టుబడుల తగ్గింపులకు శ్రీకారం చుట్టారు. జేవియర్ మిలీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ పాల్గొన్నారు.
కాగా 2023కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను సమీక్షించనున్నట్లు మిలీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అర్జెంటీనాలో త్వరలో ద్రవ్యోల్బణం దాదాపు 200 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఎగుమతులు, పెట్టుబడులను సవరించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు అనుమతిస్తానని మిలే ప్రకటించారు.
దేశాన్ని పునర్నిర్మాణ మార్గంలో తీసుకెళ్లడం, ప్రజలకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నిబంధనలను సవరించడమే తన లక్ష్యమని మిలీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పలు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణపరం చేయనుందని నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ తెలిపారు. ఈ చర్యలలో పెసా (అర్జెంటీనా కరెన్సీ) విలువను 50 శాతం మేరకు తగ్గించడం, ఇంధనం, రవాణా సబ్సిడీలపై కోత, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలకడం వంటివి ఉన్నాయి.
53 ఏళ్ల మైలీ తన ఎన్నికల ప్రచారంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, ఇందుకోసం పలు మార్పులు చేస్తానని పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో నిరాశ చెందిన అర్జెంటీనా ప్రజలకు ఆయన ఆశాజ్యోతిగా కనిపించారు. ఈ నేపధ్యంలో ప్రజా మద్దతుతో ఆయన ఆ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుని నిర్ణయాలివే..
తన 21 క్యాబినెట్ పదవులలో 12 పదవులను తొలగించారు. ఐదువేల మంది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించారు. లెక్కలేనన్ని ప్రభుత్వ నిబంధనలకు ముగింపు పలికారు. మిలిటరీలో అనేక మార్పులు చేశారు. ఆత్మరక్షణ హక్కును నిర్ధారించే బిల్లుకు మద్దతు పలికారు. చిన్నారుల ఇంటి విద్యను చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిట్‌కాయిన్‌లో చట్టబద్ధమైన చెల్లింపు ఒప్పందాలకు శ్రీకారం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. సొంత చమురు పరిశ్రమను తెరిచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment