బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నెత్తురోడింది. మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో బీరూట్ నగరమంతా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శన మిస్తున్నాయి.
ఈ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ]
ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన దాడిలా ఉందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. అయితే పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. అయితే పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment