
సాక్షి, ముంబై: డిజిటల్ కరెన్సీ రూపమైన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రికార్డులు సొంతం చేసుకుంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బిట్‌కాయిన్ తాజాగా మరో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. శనివారం తెల్లవారుజామున బిట్‌కాయిన్ చరిత్రలో తొలిసారిగా, 60,000 డాలర్లను అధిగమించింది. ఇటీవల కరెక్షన్ తరువాత మరింత పుంజుకున్న బిట్ కాయిన్ తాజా రికార్డును నమోదు చేసింది. డేటా ప్లాట్‌ఫామ్ ట్రేడింగ్ వ్యూ ప్రకారం 60,170 వద్ద ట్రేడవుతోంది. కాగా క్రిప్టోకరెన్సీ గతంలో ఫిబ్రవరి 21 న, 57,432 వద్దకు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా మహమ్మారి-ఉపశమన చట్టంపై సంతకం చేసిన తరువాత ఆర్థిక మార్కెట్లలోనెలకొన్ని ఆశలు ఈ పరిణామానికి దారితీసిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు డాలర్ బలహీన పడటంతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారానికి చెక్‌పెట్టేలా క్రిప్టో కరెన్సీ పై మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు ఉన్నాయి.