వాషింగ్టన్: కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గ సభ్యులుగా నామినేట్ చేస్తున్న పలువురు నేతలు, ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రక్షణ, గృహనిర్మాణం, వ్యవసాయం, కారి్మక శాఖల మంత్రులతోపాటు పలువురు విభాగాలకు అధిపతులుగా ట్రంప్ ఎంపిక చేసిన తొమ్మిది మందికీ ఈ బెదిరింపులు వచ్చాయి.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఎంపికైన రిపబ్లికన్ నాయకురాలు ఎలీస్ స్టెఫానిక్ సైతం బెదిరింపులను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. బాంబుతో పేల్చేస్తామని తమ ఇంటికి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని ఎలీస్ చెప్పారు. థ్యాంక్స్ గివింగ్ కోసం వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్‌కు భర్త, కుమారుడితో కలిసి కారులో వెళ్తుండగా ఆమెకు ఈ బెదిరింపు సందేశం అందింది. రక్షణ మంత్రిగా నామినేట్ అయిన పీట్ హెగ్సెత్‌కు సైతం బెదిరింపు సందేశం వచ్చింది.
పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అడ్మిని్రస్టేటర్‌గా ట్రంప్ నామినేట్ చేసిన లీ జెల్డిన్, వ్యవసాయ మంత్రిగా నామినేట్ అయిన బ్రూక్ రోలిన్స్‌కూ బుధవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఎంపికైన స్కాట్ టర్నర్, కారి్మక మంత్రిగా ఎంపికైన లోరీ చావెజ్ డెర్మర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల అమెరికా అటార్నీ జనరల్ పదవి నామినేషన్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ఫ్లోరిడా రిపబ్లికన్ నాయకుడు మాట్ గేట్జ్‌ను, వాణిజ్య మంత్రి నామినేట్ అయిన హోవార్డ్ లుట్నిక్‌ను ఆగంతకులు లక్ష్యంగా చేసుకున్నారు.
గేట్జ్ స్థానంలో ఎంపికైన పామ్ బోండీతో పాటు శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూజీ వైల్స్, సీఐఏ డైరెక్టర్‌గా నామినేట్ అయిన జాన్ రాట్‌క్లిఫ్‌కు బెదిరింపులు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీ నేతలతోపాటు విపక్ష డెమొక్రాట్లకూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.ఈ ఘటనలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ బృందంతో ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంప్రదింపులు జరుపుతోందని, అమెరికా పార్లమెంట్ భద్రతాబలగాలతో కలిసి పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నామని శ్వేతసౌధం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment