మ్యూజియం మళ్లీ పిలిచింది | Boy accidentally smashes 3500-year-old jar on museum visit | Sakshi
Sakshi News home page

మ్యూజియం మళ్లీ పిలిచింది

Published Tue, Sep 3 2024 4:54 AM | Last Updated on Tue, Sep 3 2024 4:54 AM

Boy accidentally smashes 3500-year-old jar on museum visit

నాలుగేళ్ల చిన్నారి మనసు గెలుచుకుంది

ఇజ్రాయెల్‌లో ఓ మ్యూజియంలో ఇటీవల 3,500 ఏళ్ల నాటి మట్టి కూజాను పొరపాటున కింద పడేసిన నాలుగేళ్ల ఏరియల్‌ గెలర్‌ గుర్తున్నాడా? అంతటి పురాతన కూజాను పగలగొట్టినా మ్యూజియం సిబ్బంది ఆ బాలున్ని కనీసం తిట్టకపోవడం, గాభరా పడ్డ అతని తల్లిదండ్రులను ‘మరేం పర్లేదం’టూ కూల్‌ చేసి అందరి మనసూ గెలుచుకోవడం తెలిసిందే. అంతేగాక మ్యూజియం చీఫ్‌ స్వయంగా దగ్గరుండి మరీ ఆ చిన్నారికి అన్ని వస్తువులనూ తిప్పి చూపించారు. 

ఈ సంఘటన దక్షిణ ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలో హెక్ట్‌ మ్యూజియంను 10 రోజుల క్రితం జరిగింది. అయితే కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను బాలుడు సరిగా చూడలేదని భావించిన సిబ్బంది అతన్ని మరోసారి ఆహా్వనించారు. 

ఆ మేరకు ఏరియల్‌ గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు వెళ్లి సందర్శించాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను వెంట తీసుకెళ్లి మ్యూజియానికి ప్రత్యేకంగా బహూకరించాడు! దాని వెనక దాగున్న ఆ పసిహృదయపు మనోభావాలను గౌరవిస్తూ సిబ్బంది దాన్ని ఆనందంగా స్వీకరించారు. మ్యూజియం క్యూరేటర్లు బాలునితో చాలాసేపటిదాకా గడిపారు. ఇలా పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో అతనికి ప్రత్యక్షంగా చూపించారు. 

సిబ్బందికి హేట్సాఫ్‌: తల్లిదండ్రులు 
మ్యూజియం వర్గాలకు ఏరియల్‌ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేముండే ప్రాంతం లెబనాన్‌కు అతి సమీపంలో ఉంటుంది. నిత్యం బాంబు దాడులే. ఆ ఆందోళనల నుంచి కాస్త ఊరట కోసం 10 రోజుల కింద మ్యూజియానికి వెళ్తే అనుకోకుండా ఇలా జరిగింది. దాంతో మా పని అయిపోయిందనుకున్నాం. దానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యాం.

 కానీ మ్యూజియం సిబ్బంది మా వాడిని గానీ, మమ్మల్ని గానీ ఆ రోజు పల్లెత్తు మాట కూడా అన్లేదు. వాస్తవానికి నరకప్రాయంగా మారాల్సిన ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారు’’అంటూ ఆనందం వెలిబుచ్చారు. ఈ మొత్తం ఉదంతం బాలల్లో చరిత్ర పట్ల ఉత్సుకత, ఆసక్తి రేకెత్తిస్తే తమకు అంతకంటే కావాల్సిందేమీ లేదని మ్యూజియం డైరెక్టర్‌ ఇనబల్‌ రివ్లిన్‌ అన్నారు. ఏరియల్‌ మ్యూజియం పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్‌గా మారింది.    

అందుబాటులోనే ఉండాలి! 
పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారు. వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుని మళ్లీ ప్రదర్శనకు అందుబాటులోకి వస్తుందని రిస్టొరేషన్‌ నిపుణుడు రో షెఫర్‌ తెలిపారు. ‘‘ఇలాంటి పురాతన వస్తువులు సందర్శనకు వచ్చేవారికి చేతికందేంత సమీపంలోనే 
ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?!’’ అని ఆయన అభిప్రాయపడటం విశేషం. 

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement