
లండన్ : అదృష్టం మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం ద్వారా చేతికి దక్కిన దాన్ని అనుభవించే రాత కూడా ఉండాలి. ఆ రాత లేనప్పుడు మనం కోట్లు సంపాదించినా వృధానే.. విషాదం వెంటాడితే మనం సంపాదించినవేవీ దాన్ని అడ్డుకోలేవు. ఇంగ్లాండ్‌కు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడి జీవితమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 16 ఏళ్లకు కోట్లు గెలుచుకుని, సరిగ్గా ఏడేళ్లకు.. 23 ఏళ్ల వయసులో మృత్యువాతపడ్డాడు. వివరాలు.. ఇంగ్లాండ్, బ్యాలీమార్టిన్‌కు చెందిన కాలమ్ ఫిట్జ్ పాట్రిక్‌కు 2014లో నేషనల్ లాటరీ ‘‘లాటో’’లో 4 కోట్ల రూపాయలు తగిలింది. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఇంగ్లాండ్‌లోనే లాటో లాటరీ తగిలిన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. తండ్రి కోలిన్, తల్లి షైలా, ముగ్గురు చెల్లెల్లతో ఉంటున్న అతడు వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా తన కోర్కెల్ని తీర్చుకుంటూ వస్తున్నాడు.
2017లో ఓ కారు కొనుక్కున్నాడు. తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆట కోసం కొంత మొత్తం ఖర్చుచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితమే అల్‌స్టర్ యూనివర్శిటీనుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అంతా బాగా జరుగుతోంది అనుకున్న సమయంలో గత మంగళవారం ఫిట్జ్ పాట్రిక్ మరణించాడు. అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గత శుక్రవారం సేయింట్ కాలమ్స్ చర్చిలో అతడి అంత్యక్రియలు జరిగాయి. అతడి అకాల మరణంపై పలువురు సంతాపం తెలియజేశారు. ఫిట్జ్ పాట్రిక్ మృతిపై అతడి సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ నా బెస్ట్ ఫ్రెండ్,అన్నయ్య.. మేము నిన్నెంత ప్రేమిస్తున్నామో చెప్పలేదు.. నీకెప్పటికీ తెలియదు కూడా’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment