
ఎక్కువలో ఎక్కువ ఒక టమాటా చెట్టుకు ఎన్ని పండ్లు కాస్తాయి? మహా అయితే ఓ 50. కానీ ఒకే చెట్టుకు 1,200కు పైనే పండ్లు కాశాయంటే నమ్ముతారా! నమ్మాల్సిందే. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ అసాధ్యాన్ని చేసి చూపించాడు మరి. పనిలోపనిగా గిన్నిస్ రికార్డును కూడా నెలకొల్పాడు.
– సాక్షి, సెంట్రల్‌డెస్క్
ఉత్తమమైన గార్డెనర్ కావాలని..
బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన డౌగ్లాస్ స్మిత్ ఐటీ మేనేజర్. ఇతనికి మొక్కలను చూసుకోవడం, పెంచడం చాలా ఇష్టం. ప్రపంచంలో ఉత్తమమైన గార్డెనర్ కావాలని చాలా కష్టపడుతున్నాడు. అందుకే రోజుకు 4 గంటలు తన గార్డెన్‌లో మొక్కలు, చెట్లను చూసుకుంటున్నాడు. ఇలా పని చేస్తూనే అప్పట్లో ఓ రికార్డును సృష్టించాడు.
గతంలో ఒక చెట్టుకు అత్యధికంగా కాసిన టమాటా పండ్ల సంఖ్య రికార్డు 488గా ఉండేది. ఈ రికార్డును గతేడాది ఎండాకాలంలో స్మిత్ బద్దలు కొట్టాడు. తన గ్రీన్‌హౌస్‌లోని ఒకే చెట్టుకు 839 టమాటా పండ్లు కాశాయి. ఈయన రికార్డును మళ్లీ ఈయనే ఇటీవల తిరగరాశాడు. ఇతను పెంచిన ఓ చెట్టుకు 1,269 టమాటాలు కాశాయి.
రీసెర్చ్ పేపర్లు.. సాయిల్ పరీక్షలు
తన రికార్డును తిరగరాసేందుకు స్మిత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలా రీసెర్చ్ పేపర్లను చదివాడు. గార్డెన్‌లో మొక్కలను పెంచే సాయి ల్ (మృత్తిక) శాంపిళ్లను కూడా పరీక్ష చేయించాడు. చివరకు అనుకున్నది సాధించాడు.
మరిన్ని రికార్డులు కూడా..
1,269 టమాటాల రికార్డే కాదు.. ఇంకా చాలా రికార్డులు స్మిత్ సొంతం. 2020లో 20 అడుగుల సన్‌ఫ్లవర్ చెట్టును పెంచాడు. 3.106 కేజీల బరువైన టమాటాను పండించి జాతీయ రికార్డు నెలకొల్పాడు. మరిన్ని రకాల కూరగాయలను కూడా పెద్ద సైజులో పండించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
చంద్రుని మీద ఉన్నట్టుంది
‘నాకు చంద్రుని మీద ఉన్నట్టుంది. ఏ టమాటా రకంతో ఎక్కువ పండ్లు కాస్తాయో కనుగొనేందుకు చాలానే ప్రయత్నించాను. ప్రయోగాలు చేశాను. చివరకు విజయవంతమయ్యాను’
– డౌగ్లాస్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment