జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది.
బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు.
అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు.
అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు.
అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె.
పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!
Comments
Please login to add a commentAdd a comment