కెనడాలో భారతీయుల అరెస్ట్‌.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కెనడాలో భారతీయుల అరెస్ట్‌.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు

Published Sun, May 5 2024 11:00 AM

Canada PM Justin Trudeau Comments Over 3 Member Arrest

అట్టావా: భారత్‌, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.శంకర్‌ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement