వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం(జనవరి 20వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులు
చైనా తరపున అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బృందం
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ
హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్
భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నట్లు తెలిపారు
ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, ఎరిక్ జెమ్మూర్ (ఫ్రాన్స్), మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలు సైతం ఉన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారంలో వ్యాపార దిగ్గజాలు
టెస్లా సీఈవో ఇలాన్ మస్క్
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
యాపిల్ సీఈవో టిమ్ కుక్
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్
టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖుల డుమ్మా
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం అందలేదు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గైర్హాజరు కానున్నారు
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్‌కు ఆహ్వానం వెళ్లిందా? అనేదానిపై స్పష్టత లేదు.
మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ముందస్తు సమాచారం ఇచ్చారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ సమయంలో మాజీ అధ్యక్షులు.. వాళ్ల వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీ వస్తోంది.
గడ్డకట్టే చలిలోనూ
గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అయితే మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ రోటుండా సముదాయం లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రాజధాని వాషింగ్టన్ అందంగా ముస్తాబైంది. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు సేవలందించారు. అయితే 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు ఆహ్వానం
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతు దారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతు దారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment