![Central govt Advisory To Indians Over Situation In Syria](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/7/Syria.jpg.webp?itok=3YB8-XKW)
డెమాస్కస్: సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు విజృంభిస్తున్నారు. ప్రభుత్వ దళాలు చేతులెత్తేసిన కారణంగా నగరాలకు నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిరియాలో ఉన్న వారందరూ డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది.
సిరియాలో దాడుల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని తెలిపింది. అలాగే, ఇప్పటికే సిరియాలో ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అక్కడ ఉన్న వారంతా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో టచ్‌లో ఉండాలని కోరింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగాయి. హోమ్స్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు హెచ్‌టీఎస్ ప్రకటించింది. హోమ్స్ కూడా ప్రభుత్వ దళాల చేతుల్లోంచి చేజారిపోతే, తిరుగుబాటుదళాల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉంది.
Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB
— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024
మరోవైపు తూర్పు సిరియాలో తుర్కియేకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు కూడా క్రియాశీలమయ్యారు. వారు ఇరాక్ సరిహద్దుల్లోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా అధ్యక్షుడు అసద్ సేనలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పలు చెక్ పాయింట్ల నుంచి ప్రభుత్వదళాలు పారిపోయాయి. వీటిని స్థానిక సాయుధవర్గాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడం అసద్ బలగాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియాతో తన సరిహద్దును జోర్డాన్ మూసివేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/33_15.png)
Comments
Please login to add a commentAdd a comment