బీజింగ్: పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు చైనా వెల్లడించింది. ఇది అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పుగా పరిణమించనున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జారవిడిచారు.
దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు, సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. 1989 తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది. చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష 1980 మేలో జరిగింది. అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది.
చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్‌తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 ఐసీబీఎంలున్నాయి. 2030 నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. చైనా సైన్యం వందలాది రహస్య క్షిపణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..!హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment