ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం. ఆ వ్యక్తి ఆ పొజిషన్‌కు సరిపోడనుకోవడం. వగైరా.. వగైరా. కానీ, కేవలం ఫోన్ నెంబర్‌లో ఓ దురదృష్టకరమైన సంఖ్య ఉందని చెప్పి... అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్ నెంబర్‌లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది.
గాంగ్‌డాంగ్‌లోని షెంగెన్‌కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా... ఇప్పటికీ అతీత శక్తులను, మూఢ నమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో దీనిపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా వివక్ష చూపడమేనంటున్నారు.
ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment