కవలలే గానీ... గర్భాశయాలు వేరు | China woman with two uteruses gives birth to twins from each womb | Sakshi
Sakshi News home page

కవలలే గానీ... గర్భాశయాలు వేరు

Published Tue, Oct 1 2024 3:38 AM | Last Updated on Tue, Oct 1 2024 3:38 AM

China woman with two uteruses gives birth to twins from each womb

పండంటి పాప, బాబు జననం 

చైనాలో అరుదైన ఘటన 

వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. 

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో లీ అనే మహిళ సెపె్టంబర్‌ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్‌ డాక్టర్‌ కై యింగ్‌ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. 

ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్‌ డైడెలి్ఫస్‌గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్‌ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్‌ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్‌లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం!               

ఎందుకిలా...? 
→ గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. 
→ కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. 
→ ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. 
→ ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు.  
  
 – బీజింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement