
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు హారి, మేగన్ మార్కెల్ దంపతులు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన శుభాకాంక్షల కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ పెంపుడు శునకాల సమక్షంలో రాజ దంపతులు తమ పుత్రరత్నం ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యంతో ఆ కార్డు విశేషంగా ఆకర్షిస్తోంది. బ్రిటిష్ రాజ కోటల నుంచి ఆ రాజదంపతులు కాలిఫోర్నియాలోని మాంటెసిటి భవనానికి మారిన తర్వాత వారు విడుదల చేసిన తొలి క్రిస్మస్ కార్డు ఇదే కావడం ఓ విశేషం. అయితే తమ తోటలోని చిన్న కుటీరం ముందు పెంపుడు కుక్కలు పూల, గైల సమక్షంలో ఓ చిన్ని క్రిస్మస్ టీ వద్ద వారు ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యం కూడా చూపరులను ఆకట్టుకుంటోంది.
ఆ దశ్యం ఓ అద్భుతమైన పెయింటింగ్‌లా కనిపిస్తున్నప్పటికీ అది పెయింటింగ్ ఎంత మాత్రం కాదు. అది ఫొటో. దాన్ని మార్కెల్ తల్లి స్వయంగా కెమేరాతో తీయగా, దాన్ని ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఓ పెయింటింగ్‌లా మార్చారు. క్రిస్మస్ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయంగా పలు చారిటీ సంస్థలకు తాము విరాళాలు పంపించినట్లు ఆ క్రిస్మస్ కార్డు ద్వారా మార్కెల్ తెలియజేశారు. ఆ రాజా దంపతులు 18 నెలల క్రితం మాంటెసిటీకి మారారు. అక్కడ 15 మిలియన్ డాలర్లతో (దాదాపు 110 కోట్ల రూపాయల డాలర్లు) ఓ భవనం కొనుగోలు చేసి అందులో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment