న్యూయార్క్: మిడతల దండును జ్ఞాపకం చేసుకుంటేనే భయం వేస్తుంది. గ్రీకు, అరేబియా గుండా వాయువ్య భారతదేశం వైపుగా మిడతల దండు ప్రయాణించి.. వ్యవసాయానికి అపార నష్టాన్ని కలిగించింది. అచ్చం అలాగే ఈ ఏడాది సికాడా అనే కీటకాల బెడద అమెరికాను వణికిస్తోంది.. అసలు ఈ సికాడా అంటే ఏంటో? వాటి ప్రమాదం ఏంటో తెలుసుకుందాం పదండి..!
భూమిపై ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. వివిధ రకాల జీవన చక్రాలను కలిగి ఉన్నాయి. కొన్ని రాత్రిళ్లు పడుకుంటే మరికొన్ని మేల్కొంటాయి. కొన్ని భూమిలోపల ఉంటే మరికొన్ని భూమిపై, కొన్ని జీవనకాలమంతా పొదుగే దశలోనే ఉంటే మరికొన్నింటికి స్వల్పకాలం ఇలా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఇలానే ఓ విశిష్ట లక్షణాలు కలిగిన జీవరాశుల్లోనిదే సికాడా. సికాడాలు ఈ ఏడాది అమెరికా రాష్ట్రాలపై దండయాత్ర చేయనున్నాయి. సికాడా పేరులాగానే వీటి జీవనచక్రం కూడా వింతగా ఉంటుంది.
సికాడా అంటే..
సికాడా అనేది కీటకాల సూపర్ ఫ్యామిలీ. సికాడొడియా, హెమిప్టెరా క్రమం. అంటే.. లీఫ్‌హాపర్స్(ఆకులను తినే జాతి), ఫ్రాగ్‌హాపర్(ఒకే ఎత్తు ఎగురుతూ, గెంతుతూ ఉండేవి). అవి సాధారణంగా మిడతల ఆకారంలో ఉంటాయి. సికాడాలు మానవులకు హానికరం కావు. కానీ చెట్ల ఆకులను, రసాలను పీల్చుతాయి. చెట్లుగా భావించి మనుషుల, జంతువుల శరీరాలపై వాలుతాయి. వ్యవసాయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
నిద్రాణస్థితి నుంచి దండుగా ప్రయాణం..
సికాడా బ్రూడ్-XIX(19), సికాడా బ్రూడ్ XIII(13) అనే రెండు రకాల సికాడా గ్రూప్‌లు 2024లో ఉద్భవించనున్నాయి. ఈ సికాడాలకు ప్రతి 13 నుంచి 17 ఏళ్లకు ఒకసారి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చే లక్షణం ఉంటుంది. ఈ ఏడాది 2024లో అమెరికాలోని దాదాపు 18 రాష్ట్రాల గుండా ఈ సికాడా కీటకాలు గుంపుగా ప్రయాణం చేస్తాయి.
15 రాష్ట్రాలపై ప్రభావం..
'సికాడా బ్రూడ్ XIX(19)ను "ది గ్రేట్ సదరన్ బ్రూడ్"గా పిలుస్తారు. వీటికి 13 సంవత్సరాల జీవిత చక్రం ఉంటుంది. అమెరికా భౌగోళిక ప్రాంతం ఆధారంగా అతిపెద్ద గుంపు అని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపారు. ఆగ్నేయ అమెరికాలో ఇవి సర్వసాధారణం. 15 రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. మేరీల్యాండ్ నుండి జార్జియా వరకు అలాగే మిడ్‌వెస్ట్‌లో అయోవా నుండి ఓక్లహోమా వరకు గుర్తించబడ్డాయి. అలాగే ఇల్లినాయిస్ ఉత్తర ప్రాంతంలో కూడా కనిపిస్తాయి. 2011లో చివరిసారి ప్రయాణించాయని సికాడా మానియా అనే కీటకాల వెబ్‌సైట్ పేర్కొంది.
అలబామా, అర్కాన్సాస్, జార్జియా, ఇల్లినాయిస్, ఇండియానా, కెంటుకీ, లూసియానా, మిస్సౌరీ, మిస్సిస్సిప్పి, నార్త్ కరోలినా, ఓక్లహోమా, సౌత్ కరోలినా, టేనస్సీ, వర్జీనియాల్లో ఈ ఏడాది సికాడా బ్రూడ్ XIX కనిపిస్తుంది. అవి మే మధ్యలో ప్రారంభమై జూన్ చివరిలో ముగుస్తాయి. భూమిలో 8 అంగుళాల నేలలో, 64 డిగ్రీల ఫారెన్‌హీట్ వాతావరణ పరిస్థితుల్లో బతుకుతుంటాయి.
ఐదు రాష్ట్రాలపై సికాడా బ్రూడ్-XIII..
అలాగే సికాడా బ్రూడ్-XIII చివరిసారిగా 2007లో వచ్చాయి. ఇవి ప్రతీ 17 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయి. సికాడా బ్రూడ్ XIII ఐదు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. అయోవా, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి.
ఎప్పుడు వస్తాయి?
మే నెల అంతం జూన్ సమయంలో చెట్ల ఆకులు చక్కగా పెరుగుతాయి. ఐరిస్ పువ్వులు అదే సమయంలో చిగురిస్తాయి. ఈ సమయంలో వచ్చిన వర్షంతో ఈ సికాడాలు భూమి నుంచి బయటకు వస్తాయి. వీటిరాకతో వ్యవసాయానికి తీవ్ర నష్టం కలుగుతుంది.
ఎందుకు బయటకు వస్తాయి..?
సికాడాలు భూమిలో చెట్ల వేర్ల రసాలను పీల్చుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. నేలలో బొరియలు చేసుకుంటూ నిద్రాణ స్థితిలో జీవనం సాగిస్తాయి. ఎప్పుడైతే తమ యవ్వన దశ రాగానే భూమి నుంచి బయటకు వస్తాయి. మిడతల దండు లాగే లక్షల్లో మగ సికాడాలు, ఆడ సికాడాలు కలిసి ప్రత్యేకమైన ధ్వనిని చేసుకుంటూ ప్రయాణం చేస్తాయి. ఆ సమయంలోనే మగసికాడాలు, ఆడ సికాడాలతో సంభోగం జరుపుకుంటాయి. ఆడ సికాడాలు తమ గుడ్లను చెట్ల బెరడుల్లో గుంతలు చేసి భద్రపరిచి వెళ్లిపోతాయి. అంతటితో వాటి జవనచక్రం ముగుస్తుంది. చెట్ల బెరడుల్లో ఉన్న గుడ్లు పొదిగి సికాడా కీటకాలు భూమిపై పడతాయి. అనంతరం భూమిలోపలికి ప్రయాణిస్తాయి. తగినంత ఉష్ణోగ్రత చేరుకోగానే ఆగిపోతాయి. నేలలనే నిద్రాణ స్థితిలో ఉండి మళ్లీ కాలవ్యవధి వచ్చే వరకు జీవనం సాగిస్తుంటాయి.
పరిశోధకులకు సవాలు..
బ్రిటానికా ప్రకారం.. ధ్వనిని ఉత్పత్తి చేసే కీటకానికి రెండు జతల రెక్కలు ఉన్నాయి. ఒక ప్రముఖ కన్ను, మూడు సాధారణ కళ్లు ఉన్నాయి. 0.8 నుండి 2 అంగుళాల పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం గుర్తించబడినవి మొత్తం 7 జాతులు, ఐదు వేర్వేరు బ్రూడ్‌లు ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా, 3,000 రకాల సికాడాలు ఉన్నాయి. వీటి జీవననిర్మాణాన్ని అర్థం చేసుకోవడం పరిశోధకులకు సవాలుగా మారింది.
ఇదీ చదవండి: Pyramid Secrets: రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
Comments
Please login to add a commentAdd a comment