
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 పరిస్థితిని పరీక్షించిన అనంతరం కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా-కెనడా మధ్య విమానాల రాకపోకలపై ఆంక్షలను మరికొంతకాలం పొడిగించింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా పరిస్థితి నేపథ్యంలో ఆగస్టు 21 వరకు ఇండియన్ విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసుల ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రవాణా మంత్రి ఒమర్ అల్ఘాబ్రా ట్వీట్ చేశారు.
తమ దేశ వాసుల ఆరోగ్యం, భద్రతే మొదటి ప్రాధాన్యమని కెనడా ఆరోగ్య మంత్రి వెల్లడించారు. రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమానాలను మరో 30 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం భారతీయ విమానాలపై ఆగస్టు 21 వరకు బ్యాన్ కొనసాగనుంది. అయితే పరోక్ష మార్గం ద్వారా భారతదేశం నుండి కెనడాకు ప్రయాణించేవారు మూడో దేశం నుంచి కోవిడ్-19 మాలిక్యులర్ టెస్ట్ ఫలితాలను ప్రకటించాలని కెనడా కోరింది. దీంతోపాటు పూర్తిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నఅమెరికన్ పౌరులు, కెనడా పౌరులకు ఆగస్టు 9 నుంచే అనుమతి ఉంటుందని తెలిపింది.
కాగా ఇండియాలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇపుడిపుడే చల్లారుతున్నప్పటికీ థర్డ్ వేవ్ భయం వెన్నాడుతోంది. ముఖ్యంగా దేశంలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న వైనం ఆందోళన రేపుతోంది. దీంతో పలు దేశాలు భారతీయ విమానాలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాకిస్తాన్ విమానాలపై కెనడా ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment