
బిగ్ డిబేట్ తర్వాత బైడెన్‌పై పెరుగుతున్న ఒత్తిడి
డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ తప్పించాలని కోరుతున్న ఆ పార్టీ నేతలు
ట్రంప్‌తో సంవాదంలో తడబాటుపై బైడెన్ వివరణ
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని సొంత పార్టీ నేత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
కాగా, టెక్సాస్ చెందిన డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు లాయిడ్ డాగెట్ మంగళవారం ఓ ప్రకటనలో..‘ఇటీవల ట్రంప్‌తో డిబెట్‌లో జో బైడెన్ విఫలమయ్యారు. అనేక ప్రశ్నలకు బైడెన్ సమాధానం ఇవ్వలేకపోయారు. అమెరికా ప్రజలు, పార్టీ కోసం బైడెన్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ తప్పుకోవాలని కోరుతున్నాను.
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా కాకుండా.. బైడెన్ అమెరికా ప్రజల కోసం ఎంతో మంచి చేశారు. నిబద్దతతో పనిచేశారు. ఆయన పట్ల ఎప్పటికీ గౌరవం తగ్గదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బహిరంగంగా చెప్పిన వ్యక్తి డాగెట్ కావడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఇటీవల జో బైడెన్ తీరు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రంప్‌తో బైడెన్ పోటీ పడలేరని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భంగా బైడెన్ విచిత్రంగా ప్రవర్తించడం పలు అనుమానాలకు తావిచ్చింది. వయస్సు రీత్యా కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దీంతో, ఈసారి అమెరికా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
తడబాటుపై బైడెన్ వివరణ
ట్రంప్‌తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నా సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలకు వెళ్లా. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైంది. అందుకే అలిసిపోవడం వల్లే సంవాదంలో సరిగా వాదించలేకపోయా అని చెప్పారు. అయితే తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని, అందుకు తనను క్షమించాలని, ఇది సాకు కాదని.. కేవలం తన వివరణ మాత్రమేనని పార్టీ మద్దతుదారులను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment