ఇరాన్‌పై దాడికి యత్నించిన ట్రంప్‌?! | Donald Trump Asked For Options for Attacking Iran Last Week | Sakshi
Sakshi News home page

అధికారుల సలహాతో వెనక్కి తగ్గిన ట్రంప్‌

Published Tue, Nov 17 2020 11:15 AM | Last Updated on Tue, Nov 17 2020 4:14 PM

Donald Trump Asked For Options for Attacking Iran Last Week - Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటారు. ఉన్న కాస్త సమయంలో ఎంత వీలయితే అంత చిచ్చు పెట్టే ప్రయతంలో ఉన్నారు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటికే బైడెన్‌కు, చైనాకు మధ్య వివాదాన్ని రాజేయడానికి ప్రయత్నించాడని విన్నాం. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు తెలిసింది. ప్రత్యర్థి దేశం ఇరాన్‌పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాల గురించి గతవారం ఆరా తీసినట్లు ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇరాన్‌లోని ప్రధాన అణుస్థావరంపై దాడి చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ట్రంప్‌ అధికారుల్ని కోరినట్లు సమాచారం. ఈ భేటీలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, మైక్‌ పాంపియో, కొత్తగా నియమితులైన డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ మిల్లర్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను సదరు అధికారి ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. (చదవండి: టార్గెట్‌ బైడెన్‌ వయా చైనా!)

అయితే, ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారులు అంగీకరించలేదని సమాచారం. ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అధ్యక్షుడిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అధికారుల సూచన మేరకు ట్రంప్‌ వెనక్కి తగ్గారని సమాచారం. ఇక ఈ వార్తలపై స్పందించడానికి వైట్‌హౌస్‌ అధికారులు నిరాకరించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌ ఇరాన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఒబామా హయాంలో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని 2018లో రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదేకాక కఠినమైన వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు. ఇక ఈ ఏడాది జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికన్‌ డ్రోన్‌ దాడిలో ఇరాన్ మిలిటరీ జనరల్ ఖాసీం సులేమాని మరణించారు. ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడులు జరిగాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత ముదిరాయి. (చదవండి: అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు!)

అణు ఒప్పందంలోని నిబంధనలను ఇటీవల ఇరాన్‌ మరోసారి అతిక్రమించినట్లు ఐరాస నివేదిక ఒకటి తెలిపింది. అణుశుద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌లను కీలక స్థానంలోకి మార్చే ప్రక్రియను ముగించిందని వెల్లడించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన మరుసటి రోజే ఇరాన్‌పై దాడికి గల ప్రత్యామ్నాయాలను ట్రంప్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. నటాన్జ్‌లో ఉన్న ఇరాన్ ప్రధాన అణు స్థావరం ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుంది. జో బైడెన్‌కు తీవ్రమైన విదేశాంగ విధాన సవాలుగా ఉండనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement