
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం తన ప్రత్యర్థి జో బైడెన్‌తో జరిగిన చర్చా గోష్ఠిలో పాల్గొంటూ భారత్ దేశం ప్రస్థావన రెండుసార్లు తీసుకొచ్చారు. అయితే అందరూ ఊహించినట్లుగా భారతీయులైన అమెరికన్ల మద్దతు తనకుందని చెప్పుకోవడానికి కాదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా మహమ్మారిని అరికట్టడంలో భారత్‌కన్నా అమెరికా ముందున్నదని చెప్పుకోవడానికి, అలా సమర్థించుకోవడానికి. కరోనా మృతుల సంఖ్య చైనా, రష్యా, భారత దేశాల్లో ఎక్కువుందని ఆయన ఆరోపించారు. (ట్రంప్ ఐటీ 750 డాలర్లు!)
కరోనా మహమ్మారీని అరికట్టడంలో ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జో బైడెన్ చేసిన ఆరోపణలకు సమాధానంగా ట్రంప్ మాట్లాడుతూ ‘ కరోనా బారిన పడి చైనాలో ఎంత మరణించారో మనకు తెలియదు. అలా రష్యాలో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. ఇక భారత్ విషయం అలాగే ఉంది. కరోనా మరణాల గురించి ఈ దేశాలు కచ్చితమైన సంఖ్యను వెల్లడించడం లేదు’ అని చెప్పారు.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదుకాగా, ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పుల గురించి ప్రస్తావించినప్పుడు కూడా ట్రంప్, ప్రధానంగా చైనా, రష్యా, భారత దేశాలనే నిందించారు. ‘పారిస్ పర్యావరణ ఒప్పందం’ నుంచి 2017లో అమెరికా బయటకు రావడాన్ని ట్రంప్ సమర్థిస్తూ అలా చేయక పోయినట్లయితే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే వారని అన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరిగి పోవడానికి చైనా, రష్యా దేశాలతోపాటు భారత్ కూడా కారణమని విమర్శించారు. (అమెరికా: ట్రంప్, బైడెన్ ముఖాముఖి)
Comments
Please login to add a commentAdd a comment