
వార్సా జూలోని ఆఫ్రికన్ ఏనుగులు
వార్సా : పోలాండ్, వార్సా జూలోని ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ వినూత్న పద్ధతిని ఎంచుకోబోతున్నారు జూ అధికారులు. వాటికి వైద్యపరమైన గంజాయిని ఇవ్వనున్నారు. జూలోని మూడు ఆఫ్రికన్ ఏనుగులకు ద్రవ రూపంలోని అధిక సాంద్రత కలిగిన రిలాక్సింగ్ కెన్నిబినాయిడ్‌ను తొండాల ద్వారా అందించనున్నారు. ఆఫ్రికన్ ఏనుగులపై ఇలాంటి పరిశోధనలు చేయటం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఓ పశు వైద్యాధికారి మాట్లాడుతూ.. వైద్య పరమైన గంజాయి ఏనుగుల ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇది ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ సహజ సిద్ధమైన పద్దతిని వెతుక్కునే ప్రయత్నమని చెప్పారు. ( 80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!)
కాగా, గత మార్చి నెలలో జూలోని ఆడ ఏనుగు ఎర్నా చనిపోవటంతో గుంపులోని ఫ్రెడ్జియా అనే మరో ఆడ ఏనుగు అప్పటినుంచి ఒత్తిడికి లోనవుతోంది. అంతేకాకుండా తోటి ఆడ ఏనుగులతో కూడా సఖ్యంగా ఉండటం లేదు. గుంపులోని పెద్ద చనిపోయినపుడు మిగిలిన ఏనుగులు ఆ బాధనుంచి బయటపడటానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. మామూలుగా వైద్యపరమైన గంజాయిని కుక్కలు, గుర్రాలకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment