
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్‌ను తీసుకురానున్నారు. ‘ఎక్స్ మెయిల్’ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయితే సొంత ఎక్స్‌మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్ వారి జీమెయిల్ త్వరలో తన సేవలను నిలిపివేయనుందన్న పుకార్ల నడుమ ఎక్స్‌మెయిల్ అరంగేట్రం చేయనుండటం గమనార్హం. జీమెయిల్ 2024 ఆగస్ట్ ఒకటో తేదీన కనుమరుగుకానుందంటూ ‘ఎక్స్’లో ఒక వార్త ప్రత్యక్షమై విస్తృత చర్చకు తెరలేపింది. గూగుల్ పంపిన ఒక ఈమెయిల్‌లో ‘త్వరలో జీమెయిల్ అస్తమించబోతోంది’ అంటూ ఒక సందేశం ఉందని ఆ వార్తలోని సారాంశం. దీనిపై జీమెయిల్ మాతృసంస్థ గూగుల్ స్పందించింది.
‘అవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇన్నాళ్లూ బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఫార్మాట్‌లో జీమెయిల్ సేవలు అందించాం. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే ‘స్టాండర్డ్’ వ్యూలో జీమెయిల్ సేవలను అధునాతనంగా అందిస్తాం’ అని గూగుల్ స్పష్టతనిచి్చంది. దీంతో జీమెయిల్ యూజర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా రాబోయే ఎక్స్‌మెయిల్ ఏమేరకు జీమెయిల్‌కు పోటీ ఇవ్వగలదో చూడాలి మరి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’ ఇంజనీరింగ్, సెక్యూరిటీ టీమ్ సీనియర్ సభ్యుడు న్యాట్ మెక్‌గ్రేడీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment