Elon Musk's Transgender Daughter Filed A Request To Change Her Name - Sakshi
Sakshi News home page

ఎలన్‌ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు.. సారీ ‘కూతురు’!!

Published Tue, Jun 21 2022 9:59 AM | Last Updated on Tue, Jun 21 2022 11:21 AM

Elon Musk Transgender Daughter Seeks Name Change Petition - Sakshi

ప్రపంచ అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన కన్నకొడుకు గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్‌.. కోర్టుకెక్కాడు. అయితే అది ఆస్తి కోసం మాత్రం కాదు. తండ్రి పేరుతో సంబంధం లేకుండా బతకడానికి, ఆయన నీడలో బతకడం ఇష్టం లేక..  అంతకు మించి సొసైటీలో ‘జెండర్‌’ గుర్తింపు కోసం!

ఎలన్‌ మస్క్‌ మొదటి భార్య.. కెనడా నటి జస్టిన్‌ విల్సన్‌. 2000 సంవత్సరంలో జస్టిన్‌ను మస్క్‌ వివాహం చేసుకుని.. ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్‌ ద్వారా కవలలను కంది జస్టిన్‌. ఇందులో ఒకడే గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్‌. ఇక విడాకుల తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణను సమానం చూస్తున్నారు. అయితే గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్ ‘ట్రాన్స్‌జెండర్‌’. సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. వివియన్‌ జెన్నా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు.  తాజాగా.. 18 ఏళ్లు నిండడంతో ఎలన్‌ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకు ఎక్కాడు(ఎక్కింది). 

‘‘నేను ఇకపై ఏ విధంగా, ఆకారం,  రూపం, గుర్తింపులో.. కన్నతండ్రి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆయన గుర్తింపు ఇకపై నాకు అక్కర్లేదు. నా పేరు మార్పిడికి అనుమతించండి. నా లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి’’ అంటూ..  శాంటా మోనికాలోని లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే.. ఏప్రిల్‌ నెల చివర్లోనే వివియన్‌ తన పిటిషన్‌ దాఖలు చేసింది. కానీ, అందులోని ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.


గ్జావియర్‌ పాత ఫొటో

కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్(వివియన్‌ జెన్నా విల్సన్‌)..  తన కొత్త పేరుకు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో పాటు.. కన్నతండ్రి ఎలన్‌ మస్క్‌ గుర్తింపును, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది వివియన్‌. ఇదిలా ఉంటే.. ఆ తండ్రి, ట్రాన్స్‌జెండర్‌ కూతురు మధ్య గొడవ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్‌ సైతం దీనిపై స్పందించలేదు.

మరోవైపు ట్రాన్స్‌జెండర్‌ హక్కుల విషయంలో రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ప్రకటించాడు ఎలన్‌ మస్క్‌. తాజా చట్టం ప్రకారం.. అమెరికాలో ట్రాన్స్‌జెండర్‌ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్‌ అలియాస్‌ వివియన్‌.. ఇలా పిటిషన్‌ వేసి ఉంటుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement