
కొలంబో: తీవ్ర సంక్షోభం దరిమిలా శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే దాదాపు చేతులెత్తేశారు. ఇప్పటికే దివాలా తీసిన దేశంలో రాబోయే రోజుల్లో.. మరిన్ని కష్టాలు తప్పవని లంక పౌరులకు ముందస్తు సంకేతాలు పంపించారు. ‘‘వాస్తవాల్ని దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదు. అబద్ధాలతో లంక ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి అంతకన్నా లేదు’’ అంటూ ఆయన సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘పెట్రో నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్కరోజుకు సరిపడా మాత్రమే నిల్వ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. దిగుమతులు చేసుకునేందుకు సైతం డాలర్లు కొరత నెలకొందని సంక్షోభ తాలుకా తీవ్రతను ప్రజలను వివరించే ప్రయత్నం చేశారు.
కొలంబో హార్బర్ బయట మూడు షిప్పుల్లో ఆయిల్ ఎదురు చూస్తోంది. కానీ, డాలర్లు చెల్లించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేకుండా పోయింది. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. డబ్బు ముద్రించడమే ఇక మనకు ఉన్న ఆఖరి వనరు అని సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తీవ్ర సంక్షోభంతో 22 మిలియన్ల మంది అష్టకష్టాలు పడుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పోయిన గురువారం ఆయన ప్రధాని పదవి చేపట్టారు. ఫ్యూయల్, విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని, నష్టాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment