నూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.
ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.
అయితే.. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు.
ట్రంప్ హత్యాయత్నంపై అతని అసలు ఉద్దేశ్యం ఏంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇక.. థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ, అతడు 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్‌ఔట్ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీవ్వకుండా భద్రత పెంచారు.
మరోవైపు.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దర్యాప్తుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఈ కాల్పులు ఘటనకు సంబంధిచి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు చెప్పాలని ర్యాలీకి హాజరైన ప్రజలను ఎఫ్‌బీఐ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment