ప్రపంచంలోని 190కి మించిన దేశాలలో విస్తరించిన ‘బోట్ నెట్’ పలు ఆర్థిక మోసాలకు పాల్పడుతోంది. ఇది వివిధ సంస్థల, వ్యక్తుల ఐడీలను చోరీ చేయడంతో పాటు చివరకు పిల్లలు ఆడుకునే ఎలక్ట్రానిక్ ఆట పరికరాలను కూడా యాక్సెస్ చేసి, వాటిని దుర్వినియోం చేయడం లాంటి నేరాలకు సహకరిస్తున్నదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఒక ప్రకటనలో తెలిపారు. ‘బోట్ నెట్’ నేర జాబితాలో బాంబు బెదిరింపులు, సైబర్ ఎటాక్ లాంటివి ఉన్నాయన్నారు. ఇది బాధితులను భారీ నష్టాలలోకి నెట్టివేసే అవకాశం ఉన్నదని ఎఫ్‌బీఐ పేర్కొంది.
‘బోట్ నెట్’ దగ్గర అమెరికాకు చెందిన 613 వేలకు మించిన ఐపీ చిరునామాలున్నాయని అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు కంప్యూటర్‌లు లేదా వీటితో అనుసంధానమైన పరికరాలలో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, వాటిని నేరపూరిత కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ‘బోట్ నెట్’లను సృష్టిస్తారు. ఇది ఆ కంప్యూటర్ యజమానులు గ్రహించలేనివిధంగా జాంబీ పరికరాల సైన్యాన్ని సృష్టించి వివిధ వివరాలను సేకరిస్తుంది.
ఈ కేసులో చురుగ్గా వ్యవహరిస్తున్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్.. ‘బోట్ నెట్’ బారిన పడిన పలు ఇంటర్నెట్ పరికరాలు, ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ‘బోట్ నెట్’ సృష్టికర్తలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యున్‌హే వాంగ్‌తో పాటు అతని భాగస్వాములపై పలు ఆంక్షలు విధించామని క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.
చైనా పౌరుడైన వాంగ్‌ను మే 24న సింగపూర్‌లో అరెస్టు చేశారు. మాల్‌వేర్‌ను మోహరించడం, ‘911 S5’ అనే రెసిడెన్షియల్ ప్రాక్సీ సేవను సృష్టించడం, దానిని నిర్వహించడం తదితర ఆరోపణలపై అతనిని అరెస్టు చేశారు. వాంగ్ ఈ ‘బోట్ నెట్’ కార్యకలాపాలను 2014లో ప్రారంభించాడు. అమెరికా ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం కొన్ని మిలియన్ల కాంప్రమైజ్డ్ రెసిడెన్షియల్ విండోస్ కంప్యూటర్‌ల నెట్‌వర్క్‌తో యాంగ్ కనెక్ట్ అయ్యాడు. తద్వారా పలు ఐటీ చిరునామాలను సైబర్‌క్రిమినల్స్‌కు యాక్సెస్ చేస్తూ , వాంగ్ వేల మిలియన్ డాలర్లను సంపాదించాడు.
ఎఫ్‌బీఐ సైబర్ విభాగం డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెట్ లెదర్‌మాన్ తెలిపిన వివరాల ప్రకారం యూఎస్ ఇప్పుడు యాంగ్‌ను తమ దేశానికి అప్పగించాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగా ఎఫ్‌బీఐతో పాటు దాని అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు సింగపూర్, థాయ్‌లాండ్‌లలో అతని కోసం సెర్చ్ వారెంట్‌లు జారీ చేశాయి.
ఈ కేసులో ఆపరేషన్ టన్నెల్ ర్యాట్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో ‘బోట్ నెట్’ బారిన పడిన ఖరీదైన కార్లు, విలువైన గడియారాలు, 29 మిలియన్ల డాలర్లకు పైగా క్రిప్టోకరెన్సీ , సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర ప్రాంతాలలోని పలు ఆస్తులతో పాటు 22 లగ్జరీ వస్తువులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment