..అదే కల్లోలం | Violence in Bangladesh leaves many people dead and hundreds injured as protests continue | Sakshi
Sakshi News home page

..అదే కల్లోలం

Published Wed, Aug 7 2024 4:42 AM | Last Updated on Wed, Aug 7 2024 10:01 AM

Violence in Bangladesh leaves many people dead and hundreds injured as protests continue

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

దేశవ్యాప్తంగా లూటీలు, విధ్వంసం

పార్లమెంటు రద్దు, త్వరలో ఎన్నికలు.. 

తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనుస్‌

సినీ హీరోను కొట్టి చంపిన అల్లరి మూకలు 

హోటల్‌కు నిప్పు, 24 మంది సజీవ దహనం 

ఇప్పటిదాకా 440 దాటిన మృతులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది. షేక్‌ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ వెల్లువెత్తిన నిరసనలు ఆమె రాజీనామా చేసినా ఆగడం లేదు. సోమవారం సాయంత్రానికే హసీనా దేశం వీడినా రాత్రి పొడవునా దేశవ్యాప్తంగా దమనకాండ కొనసాగింది. అల్లరి మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పు పెట్టారు. 

చివరికి పోలీస్‌ స్టేషన్లను కూడా వదల్లేదు. ఒకచోట ఎస్సైని కొట్టి చంపారు. మరోచోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై నిరసనకారులు దాడికి దిగారు. హీరో, ఆయన తండ్రి తుపాకీతో బెదిరించడంతో మరింతగా రెచి్చపోయారు. ఇద్దరినీ కర్రలతో చితకబాది చంపేశారు. జోషోర్‌ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ నాయకుని హోటల్‌ను తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు! సోమవారం ఢాకాలో పాక్షికంగా ధ్వంసం చేసిన హసీనా తండ్రి, బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాన్ని బుల్‌డోజర్లతో కూల్చేశారు.

మైనారిటీలైన హిందువులను దేశవ్యాప్తంగా అల్లరిమూకలు లక్ష్యం చేసుకున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేశారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. హసీనా పలాయనం అనంతరం దేశవ్యాప్తంగా కనీసం 100 మందికి పైగా అల్లర్లకు బలైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి          వచి్చనట్టు చెబుతున్నారు. మరోవైపు న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్‌ కాన్సులేట్‌పై దాడి జరిగింది. నిరసనకారులు కార్యాలయంలోకి జొరబడి ముజిబుర్‌ రెహ్మాన్‌ ఫొటోను, వస్తువులను ధ్వంసం చేశారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.

తాత్కాలిక ప్రభుత్వ సారధి గాయూనుస్‌
నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూ నుస్‌ సారథిగా సైన్యం కనుసన్నల్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్ష కార్యాల యం మంగళవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేసులు, జైలుశిక్ష నేపథ్యంలో యూనుస్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కారు పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. అంతకుముందు, విద్యార్థి సంఘాల అలి్టమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మొహమ్మద్‌ షాబుద్దీన్‌ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు, సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) సారథి బేగం ఖలీదా జియా (79)ను గృహనిర్బంధం నుంచి విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement