చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన ప్రధాని | Finland PM Sanna Marin Married Markus Raikkonen Intimate Ceremony | Sakshi
Sakshi News home page

సాకర్‌ ఆటగాడితో ప్రధాని వివాహం

Published Tue, Aug 4 2020 10:43 AM | Last Updated on Tue, Aug 4 2020 10:51 AM

Finland PM Sanna Marin Married Markus Raikkonen Intimate Ceremony - Sakshi

హెల్సెంకీ: ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్‌ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల స్నేహితుడు, సాకర్‌ ఆటగాడు మార్కస్‌ రాయ్కెన్‌ను వివాహమాడారు. ఈ విషయాన్ని సనా మారిన్‌ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నేను ప్రేమించే వ్యక్తితో జీవితం పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలు షేర్‌ చేశారు. సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడ్డ తాము ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సనా మారిన్‌- మార్కస్‌ల వివాహం ప్రధాని అధికారిక నివాసం(కేసరంట)లో అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. శనివారం జరిగిన ఈ వేడుకలో వధూవరులకు అత్యంత సన్నిహితులైన 40 మంది అతిథులు పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇక ఫిన్‌లాండ్‌ ప్రభుత్వం సైతం కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఫొటోను షేర్‌ చేసింది. పెళ్లిలో వధువు సనా మారిన్‌ పొడవాటి తెలుపు రంగు గౌనులో తళుకులీనగా.. వరుడు మార్కస్‌ క్లాసిక్‌ టక్సిడో సూట్‌లో హుందాగా కనిపించారు. కాగా పదహారేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్‌ అనే రెండేళ్ల కూతురు ఉంది. తమ పద్దెనిమిదవ ఏటనే ప్రేమలో పడిన వీరు శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక గతేడాది డిసెంబరులో ఫిన్‌లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్‌..  ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా చరిత్రకెక్కారు. సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఆమె.. కాట్రీ కుల్ముని(32-సెంటర్‌ పార్టీ), లీ అండర్సన్‌(32- లెఫ్ట్‌ అలయన్స్)‌, మారియా ఓహిసాలో(34- గ్రీన్‌ లీగ్)‌, అన్నా మజా హెర్నిక్సన్(55- స్వీడిష్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఫిన్‌లాండ్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement