వైమానిక దాడులతో గాజాను ఛిద్రం చేసిన ఇజ్రాయెల్ బలగాలు.. ఇక భూభాగంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాజా ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని భయంతో పరుగులు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బట్టలు, పరుపులు కార్ల పైభాగానికి కట్టుకుని.. ఇంతకాలం తమను ఆశ్రయం ఇచ్చిన నేలను వదిలేసి పారిపోతున్నారు గాజా ప్రజలు. కాలినడకన, దొరికిన వాహనం పట్టుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు నార్త్ గాజాకు చెందినవిగా పాలస్తీనాకు చెందిన ఓ రిపోర్టర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
హమాస్ సంస్థను నామారూపాలు లేకుండా చేస్తామని శపథం చేసిన ఇజ్రాయెల్.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బలగాలతో గాజాపై విరుచుకుపడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదే జరిగితే.. గాజాలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి.
Gaza |
— Younis Tirawi | يونس (@ytirawi) October 13, 2023
Residents in North Gaza (Gaza City, Beit Lahia, Beit Hanoun, and Jabalia RC) are evacuating their homes in response to the Israeli military's threat that those who stay could face deadly consequences. pic.twitter.com/ZOlU0Rg5Rj
‘‘గాజా నగర పౌరులారా.. మీరు, మీ కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదులకు మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని వాళ్లు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ తన హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. గాజాలో జనావాసాల్లో హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు మొదటి నుంచి ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
మరోవైపు గాజా ప్రజల్ని తరలిపోవాలన్న ఇజ్రాయెల్ అల్టిమేటంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అది మరింత వినాశనానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇజ్రాయెల్ హెచ్చరికలపై స్పందిస్తూ.. గాజా ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్ల తరలించడం సాధ్యం కాదన్న విషయాన్ని అక్కడి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని అంటోంది. ముఖ్యంగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను తరలించడం వీలయ్యేది కాదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్ జసరెవిక్ తెలిపారు.
1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత వేరు ప్రాంతంగా ఏర్పాటైనా గాజాలో.. 20 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంది. అందులో శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. గత 16 ఏళ్లుగా హమాస్ పాలనలో.. ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు, మరోవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గాజా స్ట్రిప్ ఎదుర్కొంటోంది. ఇక.. గత శనివారం(అక్టోబర్ 7) హమాస్.. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడికి దిగింది. కేవలం 20 నిమిషాల్లో.. ఐదువేల రాకెట్ లాంఛర్లను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 1,300 ఇజ్రాయెల్ పౌరులు, 1800 దాకా పాలస్తీనియన్లు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment