గాజా: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. కరీనా అరీవ్, డానియెల్ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే బందీలకు హమాస్ తమ చెర నుంచి విముక్తి కలిగించింది. ఇందుకు ప్రతిగా వందకు పైగా పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ తన జైళ్ల నుంచి విడిచిపెట్టనుంది.
ప్రస్తుతం విడుదలైన ఇజ్రాయెల్ బందీలు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7 దాడుల సందర్భంగా హమాస్ బంధించి తీసుకెళ్లింది. ఏడాదికిపైగా వారు హమాస్ చెరలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చిన హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.
దీంతో రెడ్‌క్రాస్ తన వాహనాల్లో వారిని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది ఇజ్రాయెల్ బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.
కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు మృతి చెందారు. ఇంతేకాక వెళుతూ వెళుతూ 100 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో 46వేల మంది దాకా పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment