డాలర్లు సంపాదించాలనే కోరికతో హరియాణా, పంజాబ్‌కు చెందిన యువత ఇటలీకి తరలివెళుతుంటుంది. అయితే వారు ఊహించిన వాతావరణం అక్కడ ఉండదు. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చవిచూసిన హరియాణాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్‌లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు.
ఒక ఏజెంట్ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడన్నారు. కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడన్నారు. వారు తమ చేత అన్నిరకాల పనులు చేయించారని, తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని తెలిపారు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్ నీటిని అందించేవారన్నారు.
లిబియాలో తమ లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందినవారున్నారని తెలిపారు. తామంతా జైలులో నరకం చూశామన్నారు. అయితే తమలోని ఒక యువకుని దగ్గర ఫోన్ ఉందని, ఆ ఫోను సాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్‌కు చేరుకోగలిగామన్నారు. బాధితుడు రాహుల్ సోదరి సోనియా మాట్లాడుతూ తన సోదరునికి ఇప్పుడు మరో జీవితం లభించినట్లయ్యిందన్నారు. తమ సోదరుడు తిరిగి రావడం వెనుక ప్రభుత్వం చొరవ ఉందన్నారు.
ఇది కూడా చదవండి: చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
Comments
Please login to add a commentAdd a comment