వెక్కిళ్లు వస్తే ఏం చేస్తారు..? ఏముంది కాసేపు ఊపిరి బిగపట్టడం లేదా నీరు తాగుతాం అంతేకదా..! కొన్నిసార్లు ఎంతసేపు ఊపిరి బిగపట్టినా లేదా నీరు తాగినా కొందరికి వెక్కిళ్లు అస్సలు ఆగవు. చాలాసేపు వెక్కిళ్లు రావడం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి వెంటనే వెక్కిళ్లు ఆగిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వారికోసమే ‘హిక్ అవే’అనే పరికరాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ అలీ సీఫీ అభివృద్ధి పరిచారు.
‘ఎల్’ఆకారంలో ఉండే ఈ స్ట్రా పరికరం దాదాపు 92 శాతం మందిలో సమర్థంగా పనిచేసిందని చెబుతున్నారు. గ్లాసులోని నీటిని ఈ స్ట్రా ద్వారా పీల్చుకుంటే చాలు క్షణాల్లో వెక్కిళ్లను తగ్గించేస్తుందని పేర్కొంటున్నారు. ఒకవైపు సన్నగా ఉండి నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మరోవైపు అడ్జస్ట్ చేసుకునే వీలుండి, చిన్న రంధ్రం మాదిరిగా ప్రెషర్ వాల్వ్ ఉంటుంది.
ఈ చిన్న వాల్వ్ ద్వారా నీటిని గట్టిగా పీల్చుకోవడం ద్వారా ఫ్రెనిక్ నాడీకణం క్రియాశీలమై మనకు వెక్కిళ్లు రావడానికి కారణమైన మన శరీరంలోని విభాజపటలం (డయాఫ్రమ్) ముడుచుకుపోతుంది. పీల్చుకున్న నీటిని మింగాలంటే వేగస్ నాడీ కణం క్రియాశీలం కావాలి. ఈ రెండు నాడీ కణాలే మనకు వెక్కిళ్లు రావడానికి కారణం. ‘హిక్ అవే స్ట్రా’ద్వారా నీటిని తాగితే ఈ రెండు నాడీ కణాలను నీటిని గట్టిగా పీల్చడం, నీటిని మింగడం వంటి వేరే పనుల్లో బిజీ చేయడం ద్వారా వెక్కిళ్లు రాకుండా చేయొచ్చని డాక్టర్ అలీ సీఫీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment