Straw
-
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: బడా కంపెనీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు (పుల్లలు) జోడించడం మొదలు పెట్టాయి. పార్లే ఆగ్రో, డాబర్, అమూల్, మథర్ డెయిరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి. రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్ అలియన్స్ (ఏఏఆర్‌సీ) మాత్రం.. ప్లాస్టిక్ స్ట్రాలను మార్చే విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇది సరఫరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాకిస్టుల వద్ద నిల్వలు అడుగంటాయని.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవి పేపర్ స్ట్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఏఏఆర్‌సీ తెలిపింది. పేపర్ స్ట్రాల తయారీ ఫ్రూటీ, అపీ ఫిజ్ పేరుతో పెద్ద మొత్తంలో పండ్ల రసాలను విక్రయించే ప్రముఖ సంస్థ పార్లే ఆగ్రో బయో డీగ్రేడబుల్ (ప్రకృతిలో కలసిపోయే/పర్యావరణ అనుకూల) స్ట్రాలను తన ఉత్పత్తులకు జోడిస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు నాటికి నిబంధనలను పాటించే లక్ష్యంతో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకున్నట్టు పార్లే ఆగ్రో సీఈవో షానా చౌహాన్ తెలిపారు. పేపర్స్ట్రాల నుంచి పీఎల్ఏ స్ట్రాలకు మారిపోతామని చెప్పారు. పీఎల్ఏ స్ట్రాలు అన్నవి మొక్కజొన్న గంజి, చెరకుతో తయారు చేస్తారు. తమ వ్యాపార భాగస్వాములు పీఎల్ఏ స్ట్రాలను తయారు చేసే వరకు, కొన్ని నెలలపాటు పేపర్ స్ట్రాలను వినియోగిస్తామన్నారు. మథర్ డైరీ సైతం దిగుమతి చేసుకున్న పేపర్ స్ట్రాలను జూలై 1 నుంచి తయారు చేసే తన ఉత్పత్తులకు జోడిస్తున్నట్టు ప్రకటించింది. రియల్ బ్రాండ్‌పై పండ్ల రసాయాలను విక్రయించే డాబర్ ఇండియా సైతం టెట్రా ప్యాక్‌లతోపాటు పేపర్ స్ట్రాలను అందించడాన్ని మొదలు పెట్టినట్టు తెలిపింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని డాబర్ ఇండియా ఈడీ షారూక్‌ఖాన్ స్పష్టం చేశారు. పాత నిల్వలపై ప్రభావం ఏఏఆర్‌సీ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ 30 నాటికి నిల్వలున్న రిటైలర్లకు తాజా పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న ఉత్పత్తులు అమ్ముడుపోయే వరకు కొంత కాలం పాటు ఉపశమనం కల్పించాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. -
చిన్న పరికరంతో వెక్కిళ్లు మటుమాయం
వెక్కిళ్లు వస్తే చాలా మంది నీళ్లు తాగుతారు. ఆగకుంటే.. నిమ్మకాయ, అల్లం ముక్క నమలడం వంటì చిట్కాలను పాటిస్తారు. అప్పుడు కూడా వెక్కిళ్లు తగ్గకుంటే ..? వెంటనే ఈ ఎల్ షేప్ స్ట్రాతో నీళ్లను సిప్ చేయండి. చిటికలోనే వెక్కిళ్లన్నీ మాయం. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందించారు. పేరు ‘ద ఫోర్స్డ్ ఇన్‌స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్’. చూడ్డానికి ఓ చిన్నపాటి గొట్టంలా కనిపిస్తుంది. ఓ వైపు మౌత్ పీస్, మరో వైపు ప్రెషర్ వాల్వ్‌తో ఉండే దీనిని సుమారు 249 మందిపై ప్రయోగించారు. దీంతో నీటిని సిప్ చే స్తే దాదాపు 92 శాతం వెక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ పరికరాన్ని ఇప్పుడు మార్కెట్లోకి అనుమతించింది ప్రభుత్వం. ప్రస్తుతం వివిధ కంపెనీల వారు, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ధర రూ. వెయ్యి నుంచి రెండు వేలకు పైగా ఉంటుంది. ఆన్లైన్ మార్కెట్లోనూ లభ్యం. -
వెక్కిళ్లు ఆగడం లేదా.. ఈ ‘స్ట్రా’తో చెక్ పెట్టేయొచ్చు!
వెక్కిళ్లు వస్తే ఏం చేస్తారు..? ఏముంది కాసేపు ఊపిరి బిగపట్టడం లేదా నీరు తాగుతాం అంతేకదా..! కొన్నిసార్లు ఎంతసేపు ఊపిరి బిగపట్టినా లేదా నీరు తాగినా కొందరికి వెక్కిళ్లు అస్సలు ఆగవు. చాలాసేపు వెక్కిళ్లు రావడం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి వెంటనే వెక్కిళ్లు ఆగిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వారికోసమే ‘హిక్ అవే’అనే పరికరాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ అలీ సీఫీ అభివృద్ధి పరిచారు. ‘ఎల్’ఆకారంలో ఉండే ఈ స్ట్రా పరికరం దాదాపు 92 శాతం మందిలో సమర్థంగా పనిచేసిందని చెబుతున్నారు. గ్లాసులోని నీటిని ఈ స్ట్రా ద్వారా పీల్చుకుంటే చాలు క్షణాల్లో వెక్కిళ్లను తగ్గించేస్తుందని పేర్కొంటున్నారు. ఒకవైపు సన్నగా ఉండి నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మరోవైపు అడ్జస్ట్ చేసుకునే వీలుండి, చిన్న రంధ్రం మాదిరిగా ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. ఈ చిన్న వాల్వ్ ద్వారా నీటిని గట్టిగా పీల్చుకోవడం ద్వారా ఫ్రెనిక్ నాడీకణం క్రియాశీలమై మనకు వెక్కిళ్లు రావడానికి కారణమైన మన శరీరంలోని విభాజపటలం (డయాఫ్రమ్) ముడుచుకుపోతుంది. పీల్చుకున్న నీటిని మింగాలంటే వేగస్ నాడీ కణం క్రియాశీలం కావాలి. ఈ రెండు నాడీ కణాలే మనకు వెక్కిళ్లు రావడానికి కారణం. ‘హిక్ అవే స్ట్రా’ద్వారా నీటిని తాగితే ఈ రెండు నాడీ కణాలను నీటిని గట్టిగా పీల్చడం, నీటిని మింగడం వంటి వేరే పనుల్లో బిజీ చేయడం ద్వారా వెక్కిళ్లు రాకుండా చేయొచ్చని డాక్టర్ అలీ సీఫీ వివరించారు. -
కొబ్బరి ఆకులతో ‘స్ట్రా’లు!
శీతల పానీయాలు, కొబ్బరి నీరు, చెరకు రసం తదితర పానీయాలు తాగడానికి ‘స్ట్రా’లు వాడుతూ ఉంటాం. ఇవి సాధారణంగా ప్లాస్టిక్‌తో తయారైనవే అయి ఉంటాయి. ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తూ.. కొబ్బరి ఆకులతో ఆర్గానిక్ ‘స్ట్రా’లు తయారు చేసి చూపించారు బెంగళూరుకు చెందిన ఓ ప్రొఫెసర్. బడుగువర్గాల వారితో చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేయించి స్ట్రాలను తయారు చేయించడమే కాదు.. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరకు విక్రయిస్తున్నారు కూడా. ఈ పరిశ్రమల్లో పని చేసే వారంతా మహిళలే కావటం మరో విశేషం! ఏటా మన దేశంలో 25 వేల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్‌తోపాటు.. పానీయాలు తాగాక అవతల పారేసే ప్లాస్టిక్ స్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటి వాడకాన్ని ఆపేయాలంటే ఆర్గానిక్ స్ట్రాలను తయారు చేయాలి. అందుకు ఏ యే పదార్థాలు పనికొస్తాయి? అని వెదుకుతూ ఉండగా.. వృథాగా పోగుపడిన కొబ్బరి ఆకులపై సాజి వర్గీస్ దృష్టి పడింది. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్. పనిచేస్తున్నది ఆంగ్ల విభాగంలో అయినప్పటికీ.. తన ఆసక్తి కొద్దీ యూనివర్సిటీ ప్రోత్సాహంతో కాంపస్‌లోని ఇంక్యుబేషన్ లేబరేటరీలో పరిశోధనలు చేపట్టి, విజయం సాధించారు. కొబ్బరి చెట్టు ప్రతి ఏటా 6 కొబ్బరి మట్టలను రాల్చుతుంది. ఈ మట్టలకు ఉండే ఎండు ఆకులతో పూరిళ్లను కప్పటం, దడులు నిర్మించడం, ఈనెలతో చీపుర్లు తయారు చేయటం, బుట్టల్లాంటివి అల్లటం మనకు తెలుసు. కొబ్బరి తోటల్లో మట్టలు, ఆకులతో చాలా మంది రైతులు నిప్పుపెడుతుంటే, కొందరు మాత్రం కంపోస్టు తయారు చేస్తున్నారు. కొబ్బరి ఆకులతో స్ట్రాలను తయారు చేసే యంత్రాలు మూడేళ్ల శ్రమ ఫలితం వ్యర్థ పదార్థంగా మనం భావిస్తున్న రాలిన కొబ్బరి మట్టలు/ఆకులతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరకు అమ్మదగిన అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ స్ట్రాలను తయారు చేశారు వర్గీస్. మూడేళ్లుగా శ్రమిస్తూ వినూత్న ఆవిష్కరణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2018లో ఈ సాంకేతికతపై పేటెంట్ పొందారు. ‘సన్‌బర్డ్ స్ట్రాస్’ పేరిట మార్కెట్లోకి ప్రవేశించారు. తొలి దశలో ఈ ప్రాజెక్టుకు క్రైస్ట్ యూనివర్సిటీ నిధులు సమకూర్చగా.. తదనంతరం అహ్మదాబాద్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి యాక్సెంచర్, హెచ్‌సిఎల్ వంటి ఐటీ సంస్థలు వర్గీస్‌కు తోడ్పాటునందించాయి. ఈ ఆవిష్కరణకు నెదర్లాండ్స్‌లో క్లైమెట్ లాంచ్పాడ్ నిర్వహించిన పోటీలో 45 దేశాల సంస్థలు పాల్గొన్నాయి. ఈ పోటీలో సన్‌బర్డ్ స్ట్రాస్ ‘బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు’ను గెల్చుకోవడంతో కొబ్బరి స్ట్రాలకు మలేసియా, అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ వంటి 10 దేశాల నుంచి 2 కోట్ల స్ట్రాలకు ఆర్డర్లు వచ్చాయని వర్గీస్ వివరించారు. గ్రామీణ మహిళలకు ఉపాధి కొబ్బరి ఆకులతో స్ట్రాల తయారీకి చిన్నపాటి పరిశ్రమ (బేసిక్ యూనిట్)ను ఏర్పాటు చేసుకుంటే చాలు. ఈ తయారీ ప్రక్రియలో 5 రకాల చిన్నపాటి యంత్రాలను ఉపయోగిస్తామని, కొద్దిపాటి శిక్షణతోనే గ్రామీణ మహిళలు ఈ యంత్రాలపై పనులు చేయటం నేర్చుకోగలుగుతారని వర్గీస్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. చిన్న పరిశ్రమకు 8 మంది మహిళా కార్మికుల అవసరం ఉంటుందన్నారు. ముందస్తు కొనుగోలు ఒప్పందం కొబ్బరి తోటల్లో వృథాగా పారేస్తున్న ఆకులతో స్ట్రాలను తయారు చేయడంగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడటం తమ లక్ష్యమని వర్గీస్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బిజినెస్ మోడల్‌ను ఆయన రూపొందించారు. కొబ్బరి స్ట్రాలను తయారు చేసే బేసిక్ యూనిట్‌కు 5 రకాల యంత్రాలు అవసరమవుతాయి. ఈ యంత్రాలను సన్‌బర్డ్ స్ట్రాస్ సంస్థ ఆసక్తి కలిగిన వారికి రూ. 3 లక్షల 70 వేలకు ‘లీజ్’కు ఇస్తుంది. 100% బైబ్యాక్ సదుపాయం ఉంటుంది. సాధారణంగా 4 ఎం.ఎం. వ్యాసం, 8 అంగుళాల పొడవు ఉండే స్ట్రాలను ఉత్పత్తి చేస్తారు. ఒక్కో స్ట్రా రూ.1కి ముందస్తు ఒప్పందం మేరకు తామే కొనుగోలు చేసి, మార్కెట్ చేస్తామని వర్గీస్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో స్ట్రాను దేశాన్ని బట్టి టోకున రూ.2.50 నంచి రూ. 6 వరకు విక్రయిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీటి ధర తగ్గే అవకాశం ఉందన్నారు. కొబ్బరి రైతులకు ప్రయోజనం కొబ్బరి సాగుకు దక్షిణాదిలోని కోస్తా తీర రాష్ట్రాలు పెట్టింది పేరు. కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు గణాంకాల ప్రకారం.. ఏపీలో 1,22,000 హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. తెలంగాణలో 1,610 హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. పొట్టి కొబ్బరి రకాల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో స్ట్రాల తయారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కొబ్బరి రైతులకూ కొంత అదనపు ఆదాయం లభిస్తుంది. గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. https://sunbirdstraws.com/ స్ట్రాల ఉత్పత్తి ఇలా.. కొబ్బరి ఎండు ఆకులను సేకరించి శుభ్రపరిచి, గుజ్జుగా మార్చుతారు. గుజ్జుతో యంత్రం ద్వారా పల్చటి షీట్లుగా తయారు చేస్తారు. ఆ షీట్లతో అనేక పొరలు కలిగిన స్ట్రాలను తయారు చేస్తారు. అనేక పొరలను అతికించడానికి క్రమంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫుడ్ గ్రేడ్ జిగురును ఉపయోగిస్తారు. తగినంత చుట్టుకొలత, పొడవు ఉండేలా స్ట్రాలను తయారు చేస్తారు. నీరు, సోడా వంటి పల్చటి ద్రవాలు, మిల్క్‌షేక్‌లు, బబుల్ టీ, పండ్ల రసాలు వంటివి తాగడానికి వీలుగా తగినంత చుట్టుకొలత, 4–6 అంగుళాల పొడవు ఉండేలా.. మార్కెట్ అవసరాలకు తగినట్లుగా తయారు చేస్తారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా.. తడి తగిలిన తర్వాత కూడా స్ట్రాలు ఆరు గంటల వరకు మెత్తబడకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్ట్రాలకు బాగా గిరాకీ ఉంది. దేశీయంగా స్టార్ హోటళ్లు కూడా ఆసక్తి చూపుతున్నాయని వర్గీస్ తెలిపారు. రోజుకు 6 వేల స్ట్రాల ఉత్పత్తి ఈ బేసిక్ యూనిట్లో 8 మంది మహిళలకు పని దొరుకుతుంది. ఒక్కో కొబ్బరి మట్టతో 150–200 వరకు స్ట్రాలు తయారు చేయవచ్చు. 30 నుంచి 40 కొబ్బరి మట్టలతో 8 గంటల్లో 6,000 స్ట్రాలను తయారు చేయవచ్చు. అంటే రోజుకు రూ. 6 వేల ఆదాయం వస్తుంది. మధురై, టుటికోరిన్ ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఆధ్వర్యంలో కొన్ని కొబ్బరి స్ట్రా యూనిట్లు ఏర్పాటయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో 20 యూనిట్లు ఏర్పాటు కానున్నాయని వర్గీస్ వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణులకే ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 4–5 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి వారికి తిరిగి వచ్చేస్తుందని వర్గీస్ (89708 30279) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. -
ఇది స్ట్రాముదం
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మట్టి కంటే, నీళ్ల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ స్ట్రాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరాలలో ఏటా సుమారు 8 వందల కోట్ల ముప్ఫై లక్షల ప్లాస్టిక్ స్ట్రాలను వాడుతున్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా ఆముదం చెట్టు కొమ్మలను వినియోగించడానికి ఇప్పుడు కొందరు పర్యావరణ హితకారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవే కనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్లాస్టిక్ స్ట్రాలు కనుమరుగైపోతాని అంటున్నాడు శివ మంజేశ్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఏ వృక్షమూ లేని చోట ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని వాడుకలోఉంది. ఇప్పుడు ఆ ఆముదపు వృక్షాలే పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడనున్నాయి! చెట్ల నుంచి ఆముదం గింజలు కోశాక ఈ చెట్లు ఎందుకూ పనికిరావు. వాటిని వెంటనే కొట్టేస్తారు. ఇప్పుడు అదే మానవాళికి లాభించనుంది. ఆముదపు చెట్లను కొట్టేయగానే గొట్టాలను తీసుకుని స్ట్రాగా చేసి వాడుకోవచ్చుని శివ మంజేశ్ చెబుతున్నాడు. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాడు. అతడు అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగానే ఆముదపు స్ట్రాలు మెల్లిగా వాడకంలోకి వస్తున్నాయి. 28 ఏళ్ల శివ, కర్నాటకలోని తన స్వస్థలం అయిన టుంకూరు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఆముదపు గొట్టాలతో పరీక్ష చేశాడు. సుమారు 80 గొట్టాలు తీసుకుని, వాటిని గోరువెచ్చని నీళ్లల్లో నానబెట్టి, మురికి అంతా తీసేసి, ఆ తరువాత వాటిని వేడి చేసిన ఉప్పు నీళ్లలో నానబెట్టి మరింత శుభ్రపరిచాడు. తర్వాత వాటిని ఎండబెట్టాడు. ఎండబెట్టిన వాటిని ఆరు నెలల లోపు ఉపయోగించుకోవచ్చని కనుక్కున్నాడు. ఈ స్ట్రాలు పేపర్ స్ట్రాలలా వెంటనే విరిగిపోవు. బలవంతంగా విరిచేస్తే విరిగిపోతాయి. వీటిని వాడి మళ్లీ శుభ్రపరచుకుని రెండోసారి వాడుకోవచ్చట. శివ మొదట తాను సేంద్రియ ఎరువులతో పెంచిన ఆముదపు చెట్ల గొట్టాలను బెంగళూరు నగరానికి తీసుకువచ్చి బెంగళూరులోని దాసరహళ్లి మెట్రో స్టేషన్‌కి దగ్గరగా ఉన్న ప్రదేశంలో సుమారు 50 మంది కొబ్బరిబొండం విక్రేతదారులు, జ్యూస్ సెంటర్లు, షాపులు, రెస్టారెంట్లలో ఉచితంగా పంపిణీ చేశాడు. ప్రజలలో చైతన్యం కలిగించడం కోసమే తాను ఉచితంగా పంచానంటాడు శివ. వెదురు, పేపర్ స్ట్రాల ఖరీదు అధికంగా ఉంటుంది కనుక ఈ స్ట్రాలు తక్కువ ధరకు లభిస్తే, అమ్మకందారులకు కూడా ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్లుగానూ ఉంటుంది.– జయంతి నా ఆలోచన అందరిలోకీ వెళ్లడం కోసం నేను వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అందరిలోనూ చైతన్యం కలిగి ముందుగా ప్లాస్టిక్ గొట్టాలను వాడటం మానేయాలనేదే నా ఆశయం. నా ఆలోచనకు మంచి స్పందనే వస్తోంది.– శివ, ఇంజనీరు -
నో స్ట్రా చాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్. మానెక్విన్ చాలెంజ్ (ఫ్రీజ్ అయిపోయినట్టు నిల్చోవడం). ఇలా కొత్త కొత్త చాలెంజ్‌లు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవి.. మరికొన్ని ఏదైనా మంచి పనికోసం చేసేవి. ఇప్పుడు నో స్ట్రా చాలెంజ్ అంటున్నారు ‘లవ్లీ’ ఫేమ్ శాన్వీ. నో స్ట్రా చాలెంజ్ అంటే కూల్‌డ్రింక్స్, కొబ్బరినీళ్లు తాగేటప్పుడు జనరల్‌గా స్ట్రా వాడుతూ ఉంటాం. దాన్ని పూర్తిగా కట్ చేయడమే నో స్ట్రా చాలెంజ్. ఈ నో స్ట్రా బ్యాక్‌స్టోరీ గురించి శాన్వీ మాట్లాడుతూ – ‘‘నా ఫ్రెండ్‌తో కలసి కొబ్బరినీళ్లు తాగుతుంటే స్ట్రా లేకుండా, నీళ్లు కిందపడకుండా తాగు చూద్దాం అని చాలెంజ్ చేసింది. ఫస్ట్ రెండు మూడు అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాను. ఇలా కొబ్బరి నీళ్లు కిందపడకుండా తాగటం నేర్చుకునే ప్రాసెస్‌లో ఇదో మంచి పనికి ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాను. వెంటనే ‘నో స్ట్రా చాలెంజ్’ అంటూ సోషల్ మీడియాలో కొబ్బరి నీళ్లు కిందపడకుండా తాగే వీడియోను అప్లోడ్ చేశాను. అందరూ ఇది ఫాలో అయితే బావుంటుంది కదా అనిపించింది. ప్లాస్టిక్ వినియోగానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ పడేసేవాళ్ల మీద అరిచేస్తాను కూడా. మెల్లి మెల్లిగా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. బావుంది కదండీ.. ‘నో’ స్ట్రా చాలెంజ్‌కి ‘యస్’ చెప్పేద్దాం. -
సూపర్ స్ట్రార్
తలమీద వెంట్రుకలు కాసిన్ని ఎక్కువ పెరిగితేనే చిరాగ్గా ఉండే ఈ సీజన్లో.. ఏమిటీ కుర్రాడు తల నిండా కూల్‌డ్రింక్ స్ట్రాలు గుచ్చుకున్నాడు? అని చిరాకు పడితే మీరు డస్ట్‌బిన్‌లో కాలేసినట్టే. అదేదో ముదిరి రోకలి తలకి చుట్టుకున్నాడనేది పాత సామెత అయితే.. రికార్డుల సరదా ముదిరి స్ట్రాలు తల నిండా చుట్టుకున్నాడని మనవాణ్ని చూశాక కొత్తగా రాసుకోవచ్చు. ఇంతకీ రికార్డుల వేటలో ఉన్న ఈ జగద్గిరిగుట్ట కుర్రాడు సూపర్ ‘స్ట్రా’ర్ అవ్వాలనుకుంటున్న వెనుక ఉన్న కథా కమామిషు ఇది. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ఇప్పుడు సిటీ కుర్రాళ్లు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నారు. అదీ ఇదీ అని కాదు అందుకోసం ఎంత కష్టానికైనా రెడీ అంటున్నారు. అదే కోవలో నగరానికి చెందిన భానుప్రకాష్ (25) కూడా ఈ రికార్డుల క్రేజ్‌ని బాగా తలకెక్కించుకున్నాడు. బీకామర్స్ పూర్తి చేసి హెల్త్‌కేర్‌లో వర్క్ చేస్తున్న ఈ కుర్రాడు ఇప్పటికే గంటలో అత్యధిక సెల్ఫీలు దిగడమనే ఫీట్ సాధించి బాగా పాపులర్ అయ్యాడు. అదే ఊపులో మరో అటెంప్ట్‌కి రెడీ అవుతున్నాడు. ప్లాస్టిక్ స్ట్రాలను అత్యధిక సంఖ్యలో తల వెంట్రుకల మధ్య పెట్టుకోవడమే ఈ అటెంప్ట్. టార్గెట్ ‘గిన్నిస్’.. తల వెంట్రుకల మధ్య అత్యధిక స్ట్రాలను పెట్టుకోవడంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. పాత రికార్డుల సంగతి అటుంచితే తాజాగా రికార్డు మాత్రం అమెరికాకు చెందిన స్టీఫెన్ రిఫర్టీ పేరు మీద ఉంది. ఆయన 2014 ఫిబ్రవరి 14న ఒకేసారి 312 స్ట్రాలను తన వెంట్రుకల మధ్య పెట్టుకొనిత గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. భానుప్రకాష్ ఈ రికార్డును తిరగరాయాలని నిశ్చయించుకున్నాడు. అయితే 350 స్ట్రాలతో మరో రికార్డు కూడా ఉందని, ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని భాను చెప్పారు. కనీసం 400-500 స్ట్రాలను తాను వెంట్రుకల మధ్య ఇమడ్చగలనని భానుప్రకాష్ ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే పలు దఫాలు దీనికి సంబంధించిన ప్రదర్శనలిచ్చిన భాను తన గిన్నిస్ రికార్డు ఫీట్‌ను వారం రోజుల్లో చేపట్టనున్నట్టు ‘సాక్షి’కి తెలిపారు. గిన్నిస్ షరతుల ప్రకారం...ఈ రికార్డు కోసం వినియోగించే స్ట్రాలు ప్రత్యేక సైజును కలిగి ఉంటాయి. స్ట్రాలు పెట్టుకున్నాక 10 సెకన్లు అలాగే ఉండాలి. ఈలోగా వాటిలో ఏ ఒక్కటి కిందపడినా అది కౌంట్ కాదు. ఇప్పటికే రెండు వీడియోలను రూపొందించిన ఈ కుర్రాడు తన ఫ్రెండ్స్ గ్రూప్ మధ్య మరోసారి ఈ ఫీట్ చేసి ఇంకో వీడియో తీస్తున్నానని చెప్పాడు. ‘మన దగ్గర దొరికే స్ట్రాలు ఎక్కువ సైజు ఉంటాయి. అందుకని వీటిని వెతికి ప్లాస్టిక్ షాప్ వాళ్ల దగ్గర కొన్నాను. లాంగ్ హెయిర్ ఉంటే ఎన్నో స్ట్రాలు పెట్టుకోవచ్చనుకుంటాం. కానీ ప్లాస్టిక్ కదా అన్నీ జారిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా జడ అల్లినట్లు పెట్టాల’ని తన రికార్డు కష్టాలను వివరిస్తున్నాడీ కుర్రాడు. ఏదేమైనా ఈ కుర్రాడి ఫీట్ మనల్ని మరోసారి గిన్నిస్‌కు ఎక్కిస్తుందని ఆశిద్దాం.