స్నేహితులతో కలిసి ఆముదపు గొట్టాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న శివ (ఎడమ)
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మట్టి కంటే, నీళ్ల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ స్ట్రాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరాలలో ఏటా సుమారు 8 వందల కోట్ల ముప్ఫై లక్షల ప్లాస్టిక్ స్ట్రాలను వాడుతున్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా ఆముదం చెట్టు కొమ్మలను వినియోగించడానికి ఇప్పుడు కొందరు పర్యావరణ హితకారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవే కనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్లాస్టిక్ స్ట్రాలు కనుమరుగైపోతాని అంటున్నాడు శివ మంజేశ్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి.
ఏ వృక్షమూ లేని చోట
ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని వాడుకలోఉంది. ఇప్పుడు ఆ ఆముదపు వృక్షాలే పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడనున్నాయి! చెట్ల నుంచి ఆముదం గింజలు కోశాక ఈ చెట్లు ఎందుకూ పనికిరావు. వాటిని వెంటనే కొట్టేస్తారు. ఇప్పుడు అదే మానవాళికి లాభించనుంది. ఆముదపు చెట్లను కొట్టేయగానే గొట్టాలను తీసుకుని స్ట్రాగా చేసి వాడుకోవచ్చుని శివ మంజేశ్ చెబుతున్నాడు. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాడు. అతడు అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగానే ఆముదపు స్ట్రాలు మెల్లిగా వాడకంలోకి వస్తున్నాయి.
28 ఏళ్ల శివ, కర్నాటకలోని తన స్వస్థలం అయిన టుంకూరు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఆముదపు గొట్టాలతో పరీక్ష చేశాడు. సుమారు 80 గొట్టాలు తీసుకుని, వాటిని గోరువెచ్చని నీళ్లల్లో నానబెట్టి, మురికి అంతా తీసేసి, ఆ తరువాత వాటిని వేడి చేసిన ఉప్పు నీళ్లలో నానబెట్టి మరింత శుభ్రపరిచాడు. తర్వాత వాటిని ఎండబెట్టాడు. ఎండబెట్టిన వాటిని ఆరు నెలల లోపు ఉపయోగించుకోవచ్చని కనుక్కున్నాడు. ఈ స్ట్రాలు పేపర్ స్ట్రాలలా వెంటనే విరిగిపోవు. బలవంతంగా విరిచేస్తే విరిగిపోతాయి. వీటిని వాడి మళ్లీ శుభ్రపరచుకుని రెండోసారి వాడుకోవచ్చట.
శివ మొదట తాను సేంద్రియ ఎరువులతో పెంచిన ఆముదపు చెట్ల గొట్టాలను బెంగళూరు నగరానికి తీసుకువచ్చి బెంగళూరులోని దాసరహళ్లి మెట్రో స్టేషన్‌కి దగ్గరగా ఉన్న ప్రదేశంలో సుమారు 50 మంది కొబ్బరిబొండం విక్రేతదారులు, జ్యూస్ సెంటర్లు, షాపులు, రెస్టారెంట్లలో ఉచితంగా పంపిణీ చేశాడు. ప్రజలలో చైతన్యం కలిగించడం కోసమే తాను ఉచితంగా పంచానంటాడు శివ. వెదురు, పేపర్ స్ట్రాల ఖరీదు అధికంగా ఉంటుంది కనుక ఈ స్ట్రాలు తక్కువ ధరకు లభిస్తే, అమ్మకందారులకు కూడా ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్లుగానూ ఉంటుంది.– జయంతి
నా ఆలోచన అందరిలోకీ వెళ్లడం కోసం నేను వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అందరిలోనూ చైతన్యం కలిగి ముందుగా ప్లాస్టిక్ గొట్టాలను వాడటం మానేయాలనేదే నా ఆశయం. నా ఆలోచనకు మంచి స్పందనే వస్తోంది.– శివ, ఇంజనీరు
Comments
Please login to add a commentAdd a comment