న్యూఢిల్లీ: ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బడా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు (పుల్లలు) జోడించడం మొదలు పెట్టాయి. పార్లే ఆగ్రో, డాబర్, అమూల్, మథర్ డెయిరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి.
రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్ అలియన్స్ (ఏఏఆర్‌సీ) మాత్రం.. ప్లాస్టిక్ స్ట్రాలను మార్చే విషయంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇది సరఫరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీల స్టాకిస్టుల వద్ద నిల్వలు అడుగంటాయని.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవి పేపర్ స్ట్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఏఏఆర్‌సీ తెలిపింది.
పేపర్ స్ట్రాల తయారీ
ఫ్రూటీ, అపీ ఫిజ్ పేరుతో పెద్ద మొత్తంలో పండ్ల రసాలను విక్రయించే ప్రముఖ సంస్థ పార్లే ఆగ్రో బయో డీగ్రేడబుల్ (ప్రకృతిలో కలసిపోయే/పర్యావరణ అనుకూల) స్ట్రాలను తన ఉత్పత్తులకు జోడిస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు నాటికి నిబంధనలను పాటించే లక్ష్యంతో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకున్నట్టు పార్లే ఆగ్రో సీఈవో షానా చౌహాన్ తెలిపారు. పేపర్‌స్ట్రాల నుంచి పీఎల్‌ఏ స్ట్రాలకు మారిపోతామని చెప్పారు. పీఎల్‌ఏ స్ట్రాలు అన్నవి మొక్కజొన్న గంజి, చెరకుతో తయారు చేస్తారు. తమ వ్యాపార భాగస్వాములు పీఎల్‌ఏ స్ట్రాలను తయారు చేసే వరకు, కొన్ని నెలలపాటు పేపర్ స్ట్రాలను వినియోగిస్తామన్నారు.
మథర్ డైరీ సైతం దిగుమతి చేసుకున్న పేపర్ స్ట్రాలను జూలై 1 నుంచి తయారు చేసే తన ఉత్పత్తులకు జోడిస్తున్నట్టు ప్రకటించింది. రియల్ బ్రాండ్‌పై పండ్ల రసాయాలను విక్రయించే డాబర్ ఇండియా సైతం టెట్రా ప్యాక్‌లతోపాటు పేపర్ స్ట్రాలను అందించడాన్ని మొదలు పెట్టినట్టు తెలిపింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని డాబర్ ఇండియా ఈడీ షారూక్‌ఖాన్ స్పష్టం చేశారు.
పాత నిల్వలపై ప్రభావం
ఏఏఆర్‌సీ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ 30 నాటికి నిల్వలున్న రిటైలర్లకు తాజా పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న ఉత్పత్తులు అమ్ముడుపోయే వరకు కొంత కాలం పాటు ఉపశమనం కల్పించాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment