సాక్షి, విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ
భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్‌సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తైంది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది.
ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన కళ్లద్దాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి ఎన్నడూ శిక్షణ అందించలేదని సీఎం తెలిపారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్, సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. పార్లే సంస్థ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన వివిధ ఉత్పత్తులను (బూట్లు, కళ్లద్దాలు, టీ షర్టులు) సీఎం స్వయంగా పరిశీలించారు. ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పార్లే ఫర్ ఓషన్స్ సంస్థ సీఈవో సిరిల్ గచ్చ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం..
పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ ప్రజలకు అభినందనలు. గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 28 కి.మీ. పరిధిలో 40 ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది ప్రజలు పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతం. అదే విశాఖను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది.
అటు పర్యావరణం.. ఇటు ఆర్థికం
నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ కీలకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే మనకు మనుగడ లేదు. సుస్థిరత, సమగ్రత మన ప్రధాన లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే దీర్ఘకాలిక మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్థిక వనరులతో సుస్థిర ప్రగతి కోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడంతో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. వంద శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.
ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన బూటును చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్
సాగరాన్ని కాపాడుకుందాం..
భూమి మీద ఆక్సిజన్‌లో 70 శాతం సముద్ర మొక్కల నుంచే లభిస్తోంది. రెయిన్ ఫారెస్ట్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. మెరైన్ ప్లాంట్స్‌లో ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్ట్ లాంటి మొక్కలు కిరణజన్య సంయోగ ప్రక్రియతో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైటో ప్లాంక్ట్‌లో ముఖ్యమైనదైన ప్లోక్లోరో కాకస్ వాతావరణంలోకి అత్యధికంగా ప్రాణ వాయువును ఉత్పత్తి చేస్తోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద, సముద్ర పక్షులు, సముద్ర క్షీరదాలు లాంటి దాదాపు 267 జాతులకు ముప్పు వాటిల్లుతోంది.
రూ.16 వేల కోట్లు.. 20 వేల మందికి ఉపాధి
సముద్రతీరంతో పాటు సాగర గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనికి స్థిరమైన పరిష్కారం దిశగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ (జీఏఎస్‌పీ), పార్లే ఫర్ ది ఓషన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైంది. భాగస్వాములను ఎంపిక చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో గ్లోబల్ అలయన్స్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్ కనుగొనడానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు, అద్దాలు లాంటి మెటీరియల్ తయారు చేసే రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ హబ్ ఏర్పాటవుతుంది. వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి 10 ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయి. వీటిద్వారా ఆరేళ్లలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. స్ధానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, పార్లే ఫర్ ది ఓషన్స్ ప్రతినిధులు
ప్రఖ్యాత కంపెనీలకు పార్లే ఉత్పత్తులు..
అందమైన బ్యాగుల నుంచి షూస్, కంటి అద్దాల వరకూ రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, లూయిస్ విట్ట¯, ఆడిడాస్, అమెరికా ఎక్స్‌ప్రెస్ లాంటి కంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్థ తయారు చేసి అందచేస్తోంది. రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్‌లోకి చాలా ఎంఎన్‌సీలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి, పార్లే ఫర్ ది ఓష¯న్స్ సీఈవో సిరిల్ గచ్చ్‌తో పాటు అందరికీ హృదయపూర్వక అభినందనలు.
దారంతా ఫ్లెక్సీలే
‘‘విశాఖ విమానాశ్రయం నుంచి కారులో వస్తుంటే దారిపొడవునా నా ఫొటోలతో ఫ్లెక్సీలు కనిపించాయి. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి వెళ్తూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించినట్లు అవుతుందని కలెక్టర్ మల్లికార్జునకు చెప్పా. అయితే అవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదని, క్లాత్‌తో తయారైనవని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ ఫెక్సీకి రూ.8 ఖర్చయితే.. క్లాత్‌కు రూ.32 ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా క్లాత్‌తో తయారైనవే ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనలో తొలి అడుగు వేస్తున్నాం. ఇప్పటికే తిరుమలను ప్లాస్టిక్ రహితంగా చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి’’ – సీఎం జగన్
రీసైక్లింగ్ ద్వారా తయారు చేసిన కళ్లజోడును పెట్టుకున్న సీఎం జగన్
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హామీలను నెరవేరుస్తున్న నాయకుడు
ఇది ఆరంభం మాత్రమే. లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. అది సాకారమైతే ప్రపంచంలోనే ప్లాస్టిక్ రహిత తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుంది. 2027 నాటికి సాధించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు. పలు దేశాల్లో ఎంతో మంది రాజకీయ నేతలను కలిశాం. అందరూ అనేక హామీలిచ్చి మర్చిపోవడాన్ని చూశా. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని చూస్తున్నాం.
– సత్య ఎస్ త్రిపాఠి, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్
చాలా ముఖ్యమైన సందర్భమిది. నేను భారత్‌కు రాకపోతే కీలక ఘట్టాన్ని మిస్ అయ్యే వాడిని. పర్యావరణం ప్రమాదంలో ఉందంటూ అనేక దేశాల ముఖ్యులు రోజుల తరబడి చర్చించడం, భారీగా నిధులు వెచ్చించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన సమావేశం చాలా భిన్నంగా అనిపించింది. సీఎం సమక్షంలో అధికార యంత్రాంగం కేవలం రెండు గంటల్లోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్మూలనలో విశాఖ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మానవ జీవనానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఆరేళ్ల పాటు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలం. మరో పదేళ్లలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రపంచంలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పుగా పరిణమించనుంది.
– సిరిల్ గచ్చ్, పార్లే ఫర్ ఓషన్స్ సీఈవో
‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్‌లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’
– సీఎం జగన్
ఇదీ చదవండి: విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
Comments
Please login to add a commentAdd a comment