beach clean up campaign
-
విశాఖలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి విశేష స్పందన
-
ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారన్న విషయాన్ని చర్చించలేము కాని, ఆయన ఆంద్రప్రదేశ్ పై మాత్రం పగపట్టినట్లు మాట్లాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రత్యేకించి తాను ఓడిపోయిన విశాఖపై ఆయన ద్వేషం అనే విషాన్ని చిమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ బీచ్ లను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్దాల నివారణ నిమిత్తం పార్లె సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల వచ్చే సంవత్సరాలలో సుమారు 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. విశాఖలో వేలాది పౌరులు, అధికారులు, విద్యార్దులు అంతా కలిసి బీచ్ లలో ఉన్న 72 టన్నుల ప్లాస్టిక్, ఇతర వ్యర్దాలను తొలగించారు. ఇందుకు ఎవరైనా సంతోషపడాలి. కాని పవన్ కళ్యాణ్ మాత్రం బాధ పడుతున్నట్లుగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ తో జగన్ ప్రజలను ఆకట్టుకుంటున్నారేమోనన్న దుగ్ద ఏర్పడినట్లు ఉంది. అంతే. వెంటనే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంను మించి పిచ్చి ఆరోపణలు, మోకాలికి, బోడిగుండుకు లింకు పెడుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా పర్యావరణంపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. అంటే దీని అర్దం విశాఖ బీచ్‌లను క్లీన్ చేస్తారా , ప్రజలకు సదుపాయం కల్పిస్తారా అన్నట్లుగా ఉంది తప్ప, ఇంకేమైనా అర్దం ఉందా? పర్యావరణ సమస్యలు నిరంతరం ఉండేవి. అవి దేశ వ్యాప్త అంశాలు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవి ఉంటాయి. తెలుగుదేశం హయాలో పర్యావరణం అంతా సజావుగా సాగిపోయినట్లు, ఇప్పుడు ఏదో పాడైపోయినట్లు ఆయన స్టేట్ మెంట్లు ఉన్నాయి. ఇంత పర్యావరణ ప్రేమికుడు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడైనా మాట్లాడారా? విశాఖ బీచ్ లో ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టాలని చంద్రబాబును ఏనాడైనా కోరారా? విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, గ్యాస్ లీకేజీ వంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదట. నిజమే..ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకు రావడం తప్పు కాదు. కాని ప్రభుత్వం ఏమి చేసినా, చెవుల్లో సీసం పోసుకున్న చందంగా, కళ్లు మూసుకున్న విధంగా ప్రకటనలు ఇవ్వడమే ఆయనలో అపరిపక్వతను తెలియచేస్తుంది. ప్రభుత్వంపై అక్కసుతో మాట్లాడడమే తప్పు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పర్యావరణహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని స్పష్టంగా చెప్పారు. అలా చెప్పిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కరే. ఆ విషయం పవన్ కు తెలియకపోవచ్చు. అసలు కోపం ఏమిటంటే జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు రావడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. దానివల్ల ప్రభుత్వం మరింత ఆదరణ పొందుతుందన్నది వారి బాధ. పరిశ్రమలు రాకపోతే, రాలేదని అనవచ్చు. ఏదైనా పరిశ్రమ తన సొంత కారణాలతో మూతపడితే, ఆ బాధ్యత అంతా జగన్ ప్రభుత్వంపై తోసి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేయవచ్చు. అందుకు భిన్నంగా భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తుంటే, అప్పుడు కాలుష్యం అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఉద్దేశం అర్దం అవుతూనే ఉంది కదా? ఇటీవలే అనకాపల్లి జిల్లాలో ఒక భారీ పరిశ్రమతో పాటు ఆరు మద్యతరహా పరిశ్రమలకు జగన్ శ్రీకారం చుట్టారు. వచ్చే నెలలో విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపన ఉంటుందని ప్రకటించారు. మరో వైపు గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఓడరేవులు వంటి వాటికి జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఇవన్ని తెలుగుదేశం నేతలతో పాటు, పవన్ కళ్యాణ్ వంటివారికి కూడా మింగుడుపడని విషయాలే. అందుకే ప్రతి దానిని తప్పుపడుతూ ఏదో రకంగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికి పూనుకుంటున్నారు. రాష్ట్రంలో కాలుష్య పరిశ్రమల గురించి కార్యకర్తలు వివరాలు సేకరించి ప్రచారం చేయాలట. రాజకీయాలలో విమర్శలు చేయడం తప్పుకాదు. కాని పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రమన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రతిదానిపై విషం చిమ్మితే అది ఆయనకే నష్టం అన్న సంగతి తెలుసుకోవాలి. ఆ సంగతి తెలిసినా, తనకు ఇంతకన్నా పోయేదేముందిలే అని టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా మాదిరి అన్ని వదలిస్తే ఎవరు మాత్రం ఏమి చేస్తారు? మరో విషయం ఏపీలో పోలీస్ మార్కు అరాచకం అంటూ ఈనాడు పత్రిక మరోసారి విషం వెళ్లగక్కింది. ఉన్నవి, లేనివి అన్నీ కలిపి వండి వార్చి పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. సోషల్ మీడియాలో కొందరు టిడిపి కార్యకర్తలు మరీ అరాచకంగా బూతులతో పోస్టింగ్ లు పెడుతుంటే ,అవి ఈనాడుకు ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ లుగా కనిపిస్తున్నాయి. వైసిపి వారు ఎవరైనా అలా చేసినా తప్పే . వైసిపివారు ఎవరైనా చేస్తే ఇదే ఈనాడు ఎంత ఘోరంగా వార్తలు ఇచ్చింది గుర్తు చేసుకోండి. కాని అదే టీడీపీ సోషల్ మీడియావారు దారుణమైన వక్రీకరణలు, బూతులు, ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఎంత నీచమైన అనుచిత వ్యాఖ్యలు చేసినా, వారి జోలికి ప్రభుత్వం వెళ్లకూడదట. అలా వెళితే అరాచకమట. టీడీపీ సోషల్ మీడియా అరాచకాన్ని అడ్డుకోగూడదట. ఈనాడు వంటి మీడియా సంస్థలు అడ్డగోలుగా ఇలాంటి నీచ సంస్కృతిని ప్రోత్సహించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. న్యాయ వ్యవస్థ ద్వారా ఎలాగైనా బెయిల్ పొందగలమన్న ఏకైక ధైర్యంతో టిడిపి సోషల్ మీడియాలోని కొందరు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు.ఎపిలో తప్ప, మిగిలిన ఏ రాష్ట్రంలోను ఇంత నీచంగా పోస్టింగ్ లు పెట్టినవారికి బెయిళ్లు రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ప్రదానితో సహా, ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నవారు జైళ్లకు వెళుతున్న ఘట్టాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాని ఎపిలో మాత్రం అది పోలీసుల వైఫల్యమో , లేక న్యాయ వ్యవస్థలోని లోపమో తెలియదు కాని, అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి సోషల్ మీడియా వారు వెంటనే బెయిల్ పొంది ,స్వేచ్చగా తిరుగుతున్నారన్న భావన ఉంది. న్యాయ వ్యవస్థలోని వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సీరియస్ అయ్యే ఆ వ్యవస్థ, ప్రభుత్వంపై, సి.ఎమ్.పై చేస్తే ఎందుకు విభిన్నంగా చూస్తుందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలడం మంచిదికాదు. ఎవరు ఎవరిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా సహించరాదు. ఇలాంటి వాటిలో వివక్షతో వ్యవహరిస్తే ఆ వ్యవస్థలకే కాకుండా, మొత్తం సమాజానికి చేటు తెస్తుందని చెప్పకతప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ (ఫొటోలు)
-
ప్లాస్టిక్ కాలుష్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్
సాక్షి, విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్‌సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తైంది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన కళ్లద్దాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి ఎన్నడూ శిక్షణ అందించలేదని సీఎం తెలిపారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్, సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. పార్లే సంస్థ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన వివిధ ఉత్పత్తులను (బూట్లు, కళ్లద్దాలు, టీ షర్టులు) సీఎం స్వయంగా పరిశీలించారు. ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పార్లే ఫర్ ఓషన్స్ సంస్థ సీఈవో సిరిల్ గచ్చ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం.. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ ప్రజలకు అభినందనలు. గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 28 కి.మీ. పరిధిలో 40 ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది ప్రజలు పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతం. అదే విశాఖను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది. అటు పర్యావరణం.. ఇటు ఆర్థికం నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ కీలకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే మనకు మనుగడ లేదు. సుస్థిరత, సమగ్రత మన ప్రధాన లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే దీర్ఘకాలిక మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్థిక వనరులతో సుస్థిర ప్రగతి కోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడంతో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. వంద శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన బూటును చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సాగరాన్ని కాపాడుకుందాం.. భూమి మీద ఆక్సిజన్‌లో 70 శాతం సముద్ర మొక్కల నుంచే లభిస్తోంది. రెయిన్ ఫారెస్ట్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. మెరైన్ ప్లాంట్స్‌లో ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్ట్ లాంటి మొక్కలు కిరణజన్య సంయోగ ప్రక్రియతో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైటో ప్లాంక్ట్లో ముఖ్యమైనదైన ప్లోక్లోరో కాకస్ వాతావరణంలోకి అత్యధికంగా ప్రాణ వాయువును ఉత్పత్తి చేస్తోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద, సముద్ర పక్షులు, సముద్ర క్షీరదాలు లాంటి దాదాపు 267 జాతులకు ముప్పు వాటిల్లుతోంది. రూ.16 వేల కోట్లు.. 20 వేల మందికి ఉపాధి సముద్రతీరంతో పాటు సాగర గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనికి స్థిరమైన పరిష్కారం దిశగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ (జీఏఎస్‌పీ), పార్లే ఫర్ ది ఓషన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైంది. భాగస్వాములను ఎంపిక చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో గ్లోబల్ అలయన్స్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్ కనుగొనడానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు, అద్దాలు లాంటి మెటీరియల్ తయారు చేసే రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ హబ్ ఏర్పాటవుతుంది. వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి 10 ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయి. వీటిద్వారా ఆరేళ్లలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. స్ధానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, పార్లే ఫర్ ది ఓషన్స్ ప్రతినిధులు ప్రఖ్యాత కంపెనీలకు పార్లే ఉత్పత్తులు.. అందమైన బ్యాగుల నుంచి షూస్, కంటి అద్దాల వరకూ రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, లూయిస్ విట్ట¯, ఆడిడాస్, అమెరికా ఎక్స్‌ప్రెస్ లాంటి కంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్థ తయారు చేసి అందచేస్తోంది. రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్‌లోకి చాలా ఎంఎన్‌సీలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి, పార్లే ఫర్ ది ఓష¯న్స్ సీఈవో సిరిల్ గచ్చ్‌తో పాటు అందరికీ హృదయపూర్వక అభినందనలు. దారంతా ఫ్లెక్సీలే ‘‘విశాఖ విమానాశ్రయం నుంచి కారులో వస్తుంటే దారిపొడవునా నా ఫొటోలతో ఫ్లెక్సీలు కనిపించాయి. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి వెళ్తూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించినట్లు అవుతుందని కలెక్టర్ మల్లికార్జునకు చెప్పా. అయితే అవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదని, క్లాత్‌తో తయారైనవని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ ఫెక్సీకి రూ.8 ఖర్చయితే.. క్లాత్‌కు రూ.32 ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా క్లాత్‌తో తయారైనవే ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనలో తొలి అడుగు వేస్తున్నాం. ఇప్పటికే తిరుమలను ప్లాస్టిక్ రహితంగా చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి’’ – సీఎం జగన్ రీసైక్లింగ్ ద్వారా తయారు చేసిన కళ్లజోడును పెట్టుకున్న సీఎం జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్న నాయకుడు ఇది ఆరంభం మాత్రమే. లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. అది సాకారమైతే ప్రపంచంలోనే ప్లాస్టిక్ రహిత తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుంది. 2027 నాటికి సాధించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు. పలు దేశాల్లో ఎంతో మంది రాజకీయ నేతలను కలిశాం. అందరూ అనేక హామీలిచ్చి మర్చిపోవడాన్ని చూశా. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని చూస్తున్నాం. – సత్య ఎస్ త్రిపాఠి, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ చాలా ముఖ్యమైన సందర్భమిది. నేను భారత్‌కు రాకపోతే కీలక ఘట్టాన్ని మిస్ అయ్యే వాడిని. పర్యావరణం ప్రమాదంలో ఉందంటూ అనేక దేశాల ముఖ్యులు రోజుల తరబడి చర్చించడం, భారీగా నిధులు వెచ్చించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశం చాలా భిన్నంగా అనిపించింది. సీఎం సమక్షంలో అధికార యంత్రాంగం కేవలం రెండు గంటల్లోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్మూలనలో విశాఖ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మానవ జీవనానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఆరేళ్ల పాటు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలం. మరో పదేళ్లలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రపంచంలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పుగా పరిణమించనుంది. – సిరిల్ గచ్చ్, పార్లే ఫర్ ఓషన్స్ సీఈవో ‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్‌లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’ – సీఎం జగన్ ఇదీ చదవండి: విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం.. -
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 22 వేలమందికిపైగా బీచ్‌క్లీనింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్ క్లీన్‌చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 20 వేలమందికి ఉపాధి కల్పన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సీఈవో సెరిల్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సన్‌గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్‌క్లీనింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘సాఫ్ట్ స్కిల్స్’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్
CM Jagan Vizag Visit.. అప్డేట్స్ ►మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్ జగన్ ఏయూ కాన్వోకేషన్ హాల్లో సీఎం జగన్ స్పీచ్ ►సాఫ్ట్ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం ►సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ►సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేశాం ►రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ►విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం ►మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ►1.62 లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ►40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ►శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు ►విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం ►నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ►ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగం ►ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలపై నిషేధం ► ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారుచేసినవే పెట్టాలి ►ఈరోజు విశాఖలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది ► ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు ►పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులు ► పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికపురోగతి సాధించాలి ►ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది ► సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ ► సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఎంవోయూ ► ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి షూస్, గాడ్జెట్స్ వంటివి తయారుచేస్తోంది ► విశాఖ చేరుకున్న సీఎం జగన్.. ఘన స్వాగతం ► సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. ► విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు. సిరిపురంలోని ఏయూ కన్వకేషన్ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి.. సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి ఆయన తిరుగుపయనం అవుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)