‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్‌మెంట్‌కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్.
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి.
ఫ్యాషన్ – పర్యావరణం
‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది.
మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం.
రిస్క్ అని హెచ్చరించారు!
ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్‌డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు.
ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్‌జోన్‌లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి.
ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను.
ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్.
ఆకులతో దారం !
ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్‌టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను.
మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్‌లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి.
ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్‌లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి.
– శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్
- – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment