సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తోన్న శుభ తరుణంలో కొన్ని దేశాల్లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్‌లు బయట పడడం ఆందోళన కలిగించే విషయమే. ఈ కొత్త రకం వైరస్‌ల వల్ల పొంచి ఉన్న ముప్పు ఏమిటో, మొత్తంగా ఈ ఏడాది పీక్కుతిన్న కరోనా వైరస్ ముప్పు నుంచి శాశ్వతంగా మానవాళికి విముక్తి లభిస్తుందో అవగతం కావాలంటే మరో మూడు, నాలుగు నెలలు నిరీక్షించాల్సిందే. అంటే వచ్చే సంవత్సరమే మనకు దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (చదవండి: వాళ్ల వయసు 1042 ఏళ్లు)
ఆత్మవిశ్వాసం ఒక్కటే ప్రస్తుతం మనముందున్న ఆయుధం. ఈ ఆయుధంతోనే భవిష్యత్తు శాసించాల్సి ఉంటుందని, పలు రకాల కరోనా వైరస్‌లపై విజయం సాధించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా గురించి పరిమిత సమాచారమే మనకు అందుబాటులో ఉంది. ఆ మేరకు ఈ వైరస్ అతి వేగంగా విజృంభిస్తోంది. అయితే ఆ స్థాయిలో మరణాలు పెరగకపోవడం, అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను ఎదుర్కొనే సామర్ధ్యం దానికి ఉన్నట్లు కనిపించక పోవడం ఉపశమనం కలిగించే విషయమే.
రూపాంతరం చెందిన రెండు, మూడు కొత్తరకం వైరస్‌లు బయట పడడంతో ఇంకా ఈ వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతుందనే విషయం పరిశోధకులకు అవగతమైంది. అయితే ఇలా వైరస్ వేగంగా రూపాంతరం చెందడం వల్ల ఆ వైరస్ తొందరగా బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండగా, కొన్నిసార్లు బలపడే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మ్యూటేషన్’ వల్ల వైరస్ రకాల నుంచి ముప్పు కూడా పొంచి ఉన్న నేపథ్యంలో వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని, వ్యాక్సిన్ల ఉత్పత్తి డోసులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేదాకా వైరస్ విజృంభణను అరికట్టాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఫైజర్ సహా పలు వ్యాక్సిన్లను రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫైజర్ మొదటి డోస్‌ను ఇచ్చిన సరిగ్గా 21 రోజులకు రెండో డోస్‌ను ఇస్తారు. రెండో డోస్ తర్వాత ఏడు రోజులకు వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి శరీరానికి లభిస్తుంది.ఇక ఆస్ట్రాజెనెకా లాంటి వ్యాక్సిన్ డోసుల మధ్య ఎక్కువ రోజుల విరామం అవసరం, అలాగే వాటి వల్ల రోగ నిరోధక శక్తి పెరగాలంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది. (చదవండి: 2021: ప్రపంచం అతలాకుతలమేనట!)
అప్పటి వరకు వైరస్ విజృంభణను కట్టడి చేయాల్సి ఉంటుందని, అందుకనే బ్రిటన్‌లో మరో విడత ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలంటే ప్రపంచ జనాభాలో 70–80 శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంత మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కనీసం ఏడాది కాలం పడుతుంది. వ్యాక్సిన్‌తో వచ్చే రోగ నిరోధక శక్తి కూడా ఏడాది కాలానికి మించి ఉండదని పరిశోధకులే చెబుతున్నప్పడు వైరస్‌పై శాశ్వత విజయం అంత ఈజీకాదు. పోలియో, స్మాల్‌పాక్స్‌లను సమూలంగా నిర్మూలించేందుకు 20 ఏళ్లు పట్టింది. మీసిల్స్ (తట్టు)ను కొన్ని దేశాల్లో సమూలంగా నిర్మూలించినా ఇప్పుడు మళ్లీ రావడం ఆందోళనకరమైన విషయం.
Comments
Please login to add a commentAdd a comment