ఫైల్ ఫొటో
బీజింగ్: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్‌లో భాగంగా చైనాకు మరిన్ని వందేభారత్ విమానాలను నడపనున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయంపై భారత్, చైనా అధికారులు దృష్టి సారించినట్లు చైనా వెల్లడించింది. నవంబర్ 13, 20, 27, డిసెంబర్ 4 తేదీల్లో ఎయిర్ ఇండియా, మరో నాలుగు విమానాలను ఢిల్లీ నుంచి నడపనున్నట్లు సోమవారం భారత పౌర విమానయాన శాఖ తెలిపింది. నవంబర్ 6న కూడా వందేభారత్ మిషన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి చైనాలోని వూహాన్ నగరానికి విమానాన్ని నడపనున్నట్లు భారత అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 30న 277 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి వూహాన్ వెళ్ళిన వందేభారత్ విమానంలో 19 మంది భారతీయులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో పౌరవిమానయాన శాఖ తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అక్టోబర్ 30న ఢిల్లీ నుంచి వూహాన్ వెళ్ళిన వందేభారత్ విమానంలో నలుగురికి కోవిడ్ నిర్ధారణ కాగా, 19 మందికి కోవిడ్ సోకినప్పటికీ ఏ లక్షణాలూ లేవని చెప్పారు. ఇరుదేశాల అధికారులు తాత్కాలిక విమానాలు నడిపే విషయంపై చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఢిల్లీ నుంచి వూహాన్ వెళ్లిన విమానంలో ప్రయాణికులంతా గుర్తింపు పొందిన ల్యాబ్స్ నుంచి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ జతచేసినవారేనని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment