
న్యూయార్క్: ప్రస్తుతం ధనవంతుల అంతరిక్షల యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్‌తో బ్రాన్సన్ నింగిలోకి పయనించగా, త్వరలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానానికి రెడీ అవుతున్నారు. ఈ రెండిటిలో భారతీయులు గర్వించే అంశం ఒకటి కామన్‌గా ఉంది. బ్రాన్సన్ ప్రయాణంలో భారత సంతతి వ్యక్తి శిరీష కీలకపాత్ర పోషించినట్లే, బెజోస్ యాత్రలో సైతం మరో భారతీయ యువతి కీలక పాత్ర పోషిస్తోంది. బెజోస్ రాకెట్ నిర్మాణ బృందంలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే(30) ముఖ్య భూమిక వహించింది. గతంలో ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. అనంతరం బ్లూ ఆరిజన్‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా చేరి, ప్రస్తుతం బెజోస్ యాత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని కళ్యాణ్. ఆమె తండ్రి మున్సిపల్ ఉద్యోగి.
మహిళ మెకానికల్ ఇంజనీరా?
ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మాస్టర్స్ చదివేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ యూనివర్సిటీలో చేరారు. ఒక అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంచుకోవడమేంటని గతంలో చాలామంది తనతో అన్నారని, కానీ ఆమె అందరి అనుమానాలు పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందని సంజల్ తండ్రి అశోక్ గవాండే ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్ష వ్యవహారాలపై ఆసక్తితో ఏరోస్పేస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని సంజల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. ఆ తర్వాత విస్కన్సిస్‌లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో, టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌లో చేరారు. బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక జూలై 20న అంతరిక్షంలోకి దూసుకుపోనుంది.