బంగ్లా పరిణామాలపై భారత్
ఢాకాలో పర్యటించిన విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య సంబంధ ఆస్తులపై కొనసాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జషిమ్ ఉద్దీన్‌తో ఢాకాలో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మిస్రీ చెప్పారు.
పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆగస్ట్ 5న భారత్‌కు వచ్చాక, రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశం అనంతరం ఢాకాలో మిస్రీ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సంబంధాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఇద్దరం చర్చించాం. భారత్ వైఖరిని స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా వివరించాను’అని మిస్రీ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయాలని భారత్ భావిస్తోందన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనుస్, విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్‌తోనూ సమావేశమయ్యానని చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధి, సుస్థిరత కోసం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు భారత్ తోడ్పాటునందిస్తుందని వారికి చెప్పానని మిస్రీ వివరించారు.
ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలకు అవరోధంగా మారే అవకాశమే లేదని చెప్పారు. ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనుస్‌కు శుభాకాంక్షలు తెలిపిన విదేశీ నేత మన ప్రధాని మోదీయేనని మిస్రీ వివరించారు. ఇద్దరు నేతలు ఫోన్‌లో మనసు విప్పి మాట్లాడుకున్నారని చెప్పారు. భారత్ సహకారంతో బంగ్లాదేశ్‌లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల రోజువారీ పురోగతి, వాణిజ్యం, వ్యాపారం, కనెక్టివిటీ, ఇంధన రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలతోనూ రెండు దేశాల సంబంధాలు ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment